Pawan Kalyan: కాశ్మీర్లో( Jammu Kashmir) అమాయక పర్యటకులపై జరిగిన కిరాతక ఉగ్రదాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అమానుషంగా జరిపిన ఈ దాడుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో అమరులైన వారికి జనసేన పార్టీ నివాళులర్పించింది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడిపై తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. భావోద్వేగంతో మాట్లాడారు. జాతీయ సమైక్యత విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడుగానే ఉంటారు. ఇప్పుడు ఈ దుర్ఘటన విషయంలో కూడా ఆయన స్పందించిన తీరు ఆకట్టుకుంటోంది. ఆలోచింపజేస్తోంది.
Also Read: ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారు? GROK షాకింగ్ సమాధానం..
* దేశభద్రతకు సవాల్
విహారయాత్రకు వచ్చిన అమాయక పర్యాటకులను ఉగ్రవాదులు వేటాడారని పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan)మండిపడ్డారు. వారి ఐడి కార్డులు అడిగిమరీ హిందువా? ముస్లింవా? తెలుసుకొని మరి అత్యంత క్రూరంగా, కర్కసంగా ప్రాణాలు తీయడం దేశ భద్రతకు సవాల్ గా మారిందన్నారు. జనసేన ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ తమది జాతీయ విధానమని చెప్పుకొచ్చారు. ఈ ఘటనలో కావలికి చెందిన మధుసూదన్ అమరుడైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జనసేన తరఫున ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఆ కుటుంబానికి జనసేన ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనలు చనిపోయిన అమరులకు జనసేన పక్షాన నివాళులు అర్పించారు.
* అటువంటి వారికి ఇక్కడ ఉండే ఛాన్స్ లేదు
మరోవైపు భారత్ గడ్డపై ఉంటూ పాకిస్తాన్( Pakistan) కు మద్దతుగా మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వారికి పాకిస్తాన్ పై ప్రేమ ఉంటే ఆ దేశానికి వెళ్ళిపోవచ్చు అని స్పష్టం చేశారు. మతం అడిగి చంపేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతుంటే.. మూర్ఖంగా నమ్మరు ఎందుకని ప్రశ్నించారు. అతి మంచితనం, అతి సహనం కూడా ప్రమాదకరమే అని హెచ్చరించారు. కాల్చుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవడం సరికాదన్నారు. పాకిస్తాన్ ను మనం మూడుసార్లు ఓడించామని గుర్తు చేశారు. ఉగ్రవాదులను ఎదుర్కోవాలంటే ధైర్యం అవసరమన్నారు. హిందువులకు ఉన్నది ఒకటే దేశమని.. ఇక్కడ కూడా హిందువులనే టార్గెట్ చేస్తే ఎక్కడికి పోవాలని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులపై ఏమాత్రం కనికరం చూపించవద్దని.. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
* రాజకీయ కామెంట్స్..
మరోవైపు పవన్ కళ్యాణ్ రాజకీయంగా కూడా వ్యాఖ్యానాలు చేశారు. సరిహద్దు భద్రతను( Border Security) మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిరాయుధులపై దాడి చేయడం పిరికిపంద చర్య అన్నారు. కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన ఉన్నంతవరకు ప్రశాంతంగా ఉందని.. అధికారం రాష్ట్రం చేతిలోకి వచ్చిన తర్వాతే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పవన్ పరోక్షంగా కామెంట్స్ చేశారు. మృతుల కుటుంబ సభ్యులు చెబుతున్నట్లుగా.. ఉగ్రవాదులు హత్య చేసి మోడీకి చెప్పుకోండి అని అన్నారని పవన్ తెలిపారు. భారతదేశంలో ఉండి పాకిస్తాన్ కు మద్దతుగా మాట్లాడుతున్నారని పరోక్షంగా రాజకీయ పక్షాలను ఉద్దేశించి అన్నారు పవన్ కళ్యాణ్. అటువంటి వారు దేశం వెళ్లిపోవచ్చు అని కూడా స్పష్టం చేశారు.
Also Read: వేగవంతమైన రాఫెల్-ఎం ఫైటర్ జెట్‌లు ఓడలపై ఎలా ల్యాండ్ అవుతాయి?