Pawan Kalyan Birthday: పవన్ కళ్యాణ్.. ఈ పేరులోనే ఒక మేనియా ఉంది. సినీ రంగంలో అడుగుపెట్టిన అనతి కాలంలోనే మెగా పవర్ స్టార్ గా ఎదిగారు. లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.పేజీలకు పేజీలు డైలాగ్స్ చెప్పకపోయినా.. స్ప్రింగ్ లా డాన్సులు వేయకపోయినా.. ఆయన తెరపై కనిపిస్తే చాలు అభిమానులు ఉప్పొంగి పోతారు. ఎంత ఎత్తుకు ఎదిగినా..సాధారణ జీవితం గడిపే పవన్ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.కేవలం సామాన్యులే కాదు.. వివిధ రంగాల ప్రముఖులు సైతం ఆయన అభిమానులే.మెగాస్టార్ వారసుడిగా సినీ రంగంలో అడుగు పెట్టిన పవన్.. ఆ చట్రం నుంచి బయటకు వచ్చి.. తనకంటూ ఒక వారధిని నిర్మించుకున్నారు. రాజకీయరంగంలో అడుగుపెట్టి ఎన్నో ఒడిదుడుకులను, అవమానాలను ఎదుర్కొన్నారు. అలసిపోలేదు.. పోరాడుతూ వచ్చారు. ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. ఈరోజు ఆయన పుట్టినరోజు. అభిమానులకు వేడుక రోజు. పవన్ కళ్యాణ్ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే.. ఎన్నో ఒడిదుడుకులు, వ్యక్తిగత వివాదాలు.. ఇలా అన్నింటిని అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నారు.
* సాధారణ కుటుంబంలో పుట్టి
కొణిదెల వెంకట్రావు, అంజనీ దేవి దంపతులకు 1968 సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ జన్మించారు. వెంకట్రావు సాధారణ పోలీస్ కానిస్టేబుల్. వృత్తిరీత్యా ఆయన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు బదిలీ అవుతూ ఉండేవారు. తండ్రి ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాల్లో నివసించడంతో పవన్ కు అన్ని ప్రాంతాలపై అవగాహన ఉంది. అక్కడ యాషా భాషపై అవగాహన ఏర్పరచుకున్నారు. చిన్నతనంలోనే ఆస్తమా రుగ్మతకు గురయ్యారు పవన్. తరచూ అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యేవారు. స్నేహితుడు కూడా చాలా తక్కువ. చదువులో వెనుకబాటుతో ఒత్తిడికి గురయ్యే వారు. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలని భావించారట.
* సత్యానంద్ వద్ద శిక్షణ
పవన్ ను సినీ రంగానికి పరిచయం చేయాలని భావించారు చిరంజీవి. సత్యానంద్ వద్ద నటనలో శిక్షణ ఇప్పించారు.’అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు పవన్. నాటి నుంచి నేటి వరకు తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. చదువులో వెనుకబడిన నేర్చుకోవాలన్న ఆశ పవన్ లో ఎక్కువ. పారా గ్లైడింగ్, కర్ణాటక సంగీతం, వయోలిన్ నేర్చుకున్నారు. డిప్లమా ఇన్ ఎలక్ట్రానిక్స్ చేసి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ గురించి కూడా తెలుసుకున్నారు.
* సమకాలీన అంశాలపై అవగాహన
పవన్ లో జాతీయ భావం అధికం. భారతీయతకు ఎంతో ఇష్టపడతారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, పరిస్థితులపై పవన్ కు విస్తృతంగా అవగాహన ఉంది. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పుడు పవన్ చాలా యాక్టివ్ గా పని చేశారు. పార్టీలో యువ విభాగం యువరాజ్యం అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషించారు. ప్రజారాజ్యంలో ఎన్నో గుణపాఠాలు నేర్చుకొని.. 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని ప్రకటించారు. దాదాపు పది సంవత్సరాల పాటు పవర్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. గత ఐదేళ్లుగా ఎన్నో రకాల అవమానాలను ఎదుర్కొన్నారు. వాటన్నింటికి 2024 ఎన్నికల్లో బదులిచ్చారు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో శత శాతం విజయం సాధించారు. కూటమి అధికారంలోకి రావడానికి కారణమయ్యారు.
* సంపాదన ఎక్కువ.. దాచింది తక్కువ
నిజాయితీకి, పారదర్శకతకు పెద్దపీట వేసే పవన్ సంపాదన అధికం. కానీ దానిని పార్టీ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం విపరీతంగా ఖర్చు పెట్టే గుణం పవన్ సొంతం. మొన్నటి ఎన్నికల సమయంలో ఆయన అఫీడవిట్ దాఖలు చేశారు. అందులో పవన్ కళ్యాణ్ ఆస్తుల విలువ 165 కోట్లు. గడిచిన ఐదేళ్లలో ఆయన ఆదాయం 114 కోట్లు. ఆదాయపు పన్నుకు 47 కోట్లు, జీఎస్టీ కింద 26 కోట్లు చెల్లించారు. అదే స్థాయిలో అప్పులు ఉన్నాయి. 64 కోట్లు అప్పులు ఉన్నట్లు చూపారు. కానీ ఆయనపై ప్రత్యర్థులు వేరే రకంగా ప్రచారం చేశారు. కానీ ప్రజలు మాత్రం ఈసారి పవన్ కు ఛాన్స్ ఇచ్చారు. పవన్ మాటను బలంగా నమ్మారు. అన్నయ్య చిరంజీవి రాజకీయాల్లో రాణించాలని ఆకాంక్షించారు. కానీ అనుకున్న విధంగా సాధించలేకపోయారు. దాన్ని సుసాధ్యం చేసి పవన్ చూపించారు. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిద్దాం.