Pawan Kalyan: జనసేన ఆవిర్భవించి సుదీర్ఘకాలం అవుతోంది. కానీ ఇంతవరకు సరైన విజయం దక్కలేదు. 2014లో రాష్ట్రంలో టిడిపికి, కేంద్రంలో బిజెపికి పవన్ మద్దతు తెలిపారు. ఆయన అనుకున్నట్టే రెండు పార్టీలు అధికారంలోకి వచ్చాయి. కానీ పవన్ మాత్రం తన జనసేనను విస్తృతం చేయలేకపోయారు. సంస్థాగతంగా బలోపేతం కాలేకపోయారు. అది ముమ్మాటికి జనసేనకు లోటే. 2014 నుంచి 2019 మధ్య పార్టీ బలోపేతానికి అవకాశం కనిపించింది. కానీ దానిని సద్వినియోగం చేసుకోవడంలో పవన్ ఫెయిల్ అయ్యారు. దాని పర్యవసానమే 2019లో ఆ పార్టీకి ఓటమి. చివరకు తనకు తాను కూడా గెలవలేకపోయారు పవన్. తనకు జై కొట్టిన జనం.. వెంట వచ్చిన లక్షలాది జనం అండగా నిలవలేదు. అభిమానం ఓటు రూపంలో మారలేదు. దానిని గుర్తుచేసుకునే పవన్ ఇప్పుడు రాజకీయాలు మొదలుపెట్టారు.
తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ స్థానాలను ఆ పార్టీ దక్కించుకుంది. అయితే ఇక్కడే జనసేన చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. మిమ్మల్ని ఒక ఆశా కిరణంగా చూసుకొని రాజ్యాధికారం దక్కించుకోవాలని చూసామని కాపు సామాజిక వర్గంప్రతినిధులు ప్రశ్నించడం ప్రారంభించారు. అయితే ఇలా ప్రశ్నించిన వారికి పవన్ నేరుగా ప్రశ్నిస్తున్నారు. గతసారి మీ అందరిని మా వారు అనుకున్నానని.. కానీ రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్కచోట కూడా గెలుపు ఇవ్వలేకపోయారని.. నాడు ఒకచోట గెలిపించి ఉంటే నేడు పొత్తులో భాగంగా సింహ ప్రయోజనాలను అడిగి ఉండేవాడినని పవన్ చెప్పుకొస్తున్నారు. పవన్ వ్యాఖ్యల్లోనూ న్యాయం ఉంది. కానీ ఒక పొలిటికల్ పార్టీగా విస్తృతం చేయడంలో పవన్ కూడా పనితీరు మెరుగుపరుచుకోవాల్సి ఉంది.
ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ పార్టీని స్థాపించారు. అనతి కాలంలోనే అధికారంలోకి రాగలిగారు. మిగతా రాష్ట్రాలకు పార్టీని విస్తరించగలిగారు. కెసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని హైలెట్ చేసుకొని పార్టీని ఏర్పాటు చేశారు. సుదీర్ఘకాలం పోరాడి విజయం సాధించారు. ఏపీ సీఎం జగన్ సైతం పట్టుదలతో పార్టీ స్థాపించారు. అదే పట్టుదలతో పార్టీని జనాల్లోకి తీసుకెళ్లగలిగారు. మంచి విజయాన్ని దక్కించుకున్నారు. అయితే ఈ స్థాయిలో పవన్ పోరాటం ఉందా? లేదా? అన్నది ఆయనే విశ్లేషించుకోవాలి. పార్టీని నిబద్ధతతో నడుపుతున్నది నిజం. సినిమా రంగంలో తాను సంపాదిస్తున్నది పార్టీ కోసం ఖర్చు చేస్తున్నది నిజం. విపత్తులు, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు ఆదుకుంటున్నది నిజం. కానీ రాజకీయాలు అంటే ఈ తరహా కావు. క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవడం, సంస్థాగత నిర్మాణం తోనే రాజకీయాల్లో అనుకున్నది సాధించగలం. అందుకే పవన్ చేస్తున్న రాజకీయం విలువలతో కూడినదే అయినా.. సంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా ఉండడమే ఇబ్బందికరం. పవన్ చర్యలను ఎవరూ తప్పు పట్టకున్నా.. రాజకీయంగా ఆయన వేసి అడుగులు మాత్రం తప్పటడుగులు గా ఉన్నాయి. అయితే ఇప్పుడిప్పుడే వాటిని గాడిన పెట్టే ప్రయత్నం చేస్తుండడం విశేషం. అందులో భాగంగానే తన బలాన్ని, బలగాన్ని వాడుకోవాలని ఒక నిర్ణయానికి రావడం విశేషం. ఇప్పుడిప్పుడే సాంప్రదాయ రాజకీయాలను వంటబెట్టించుకుంటున్నట్లు తెలుస్తోంది.