Pawan Kalyan
Pawan Kalyan : ఏపీ ప్రభుత్వం ( AP government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. ఈరోజు శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. అందులో కీలకమైన ప్రతిపాదనలకు సభ ఆమోదించింది. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య కమిషన్ నివేదిక రిపోర్టుకు సైతం ఆమోదముద్ర వేసింది. జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేపడతామని ప్రకటించింది. జనాభా గణన పూర్తయిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చారు.
Also Read: జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ.. అంతవరకు ఆగాల్సిందే : చంద్రబాబు
* కేంద్రానికి ప్రతిపాదన
మరోవైపు అసెంబ్లీ( AP assembly) వేదికగా కీలక ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో సంచారజాతిగా ఉన్న బుడగ జంగం కులాన్ని ఎస్సీల్లో చేర్చాలంటూ ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అసెంబ్లీ సైతం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని త్వరలోనే కేంద్రానికి పంపనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ పై జరిగిన చర్చలో భాగంగా సీఎం చంద్రబాబు ఈ కీలక ప్రకటన చేశారు. మరోవైపు ఇదే బుడగజంగాలను ఎస్సీలలో చేర్చాలని 2019, 2023లో సైతం ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయితే ఆ ప్రతిపాదనలకు కేంద్రం నుంచి ఆమోదం లభించలేదు. ఇప్పుడు మరోసారి టిడిపి ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపడం విశేషం. కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి కావడంతో తప్పకుండా ఆమోదం ముద్ర పడుతుందని నమ్మకంగా చెబుతున్నారు. అదే జరిగితే ఎస్సీ సామాజిక వర్గ జాబితాలో మరో కులానికి చోటు దక్కినట్టే.
* సంచార జాతిగా
ఏపీలో బుడగ జంగం( Budaga Jangam ) సామాజిక వర్గం సంచార జాతిగా ఉంది. ఈ బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలంటూ గత కొన్నేళ్లుగా డిమాండ్ వినిపిస్తోంది. అయితే గత ప్రభుత్వాలు ఈ ప్రయత్నాలు చేసినా సఫలీకృతం కాలేదు. కానీ ఎట్టకేలకు టిడిపి కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ తెరపైకి వచ్చిన క్రమంలో.. పనిలో పనిగా కేంద్రానికి బుడగ జంగం కులాల పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తోంది టిడిపి కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు మరోసారి అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణకు తాము అనుకూలమని చాలా రోజుల కిందటే చెప్పామన్న విషయాన్ని గుర్తు చేశారు.
* పవన్ కీలక ప్రసంగం
కాగా ఎస్సీ వర్గీకరణ పై జరిగిన చర్చల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( deputy CM Pawan Kalyan )కీలక ప్రసంగం చేశారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగను ఆకాశానికి ఎత్తేశారు. ఆయన పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ అంటూ కొనియాడారు. అటు తరువాత చంద్రబాబు సైతం కృషి చేశారని చెప్పుకొచ్చారు. జాతీయస్థాయిలో సైతం ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు కృషి చేయాలని.. సక్రమంగా జరిగేలా చూడాలని సభా వేదికగా విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్.