Pawan Kalyan : ఏపీ( Andhra Pradesh) రాజకీయాల్లో రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం ఈరోజుతో ఎనిమిది నెలల పాలన పూర్తి చేసుకుంది. నిన్ననే సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్షను ఏర్పాటు చేశారు. దీనికి డిప్యూటీ సీఎం పవన్ హాజరు కాలేదు. కానీ ఆయన అనారోగ్యంతో బాధపడుతుండడంతోనే గైర్హాజరైనట్లు పిలుస్తోంది. మరోవైపు ఈరోజు పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల ఆలయ సందర్శనకు బయలుదేరారు. హైదరాబాద్ నుంచి కొద్దిసేపటి కిందట కేరళ చేరుకున్నారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉన్నత స్థాయి సమీక్షకు గైర్హాజరు కావడం ఏంటి? ఈరోజు ఆలయాల సందర్శనకు బయలుదేరడం ఏంటి అన్న చర్చ నడుస్తోంది. కూటమిలో ఏమైనా విభేదాలు ఉన్నాయా? అందుకే ఆయన అలా వ్యవహరిస్తున్నారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి.
* అనారోగ్యంతో పవన్
గత కొద్ది రోజులుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) జ్వరంతోపాటు వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు టాక్ నడిచింది. కార్యాలయ అధికారుల సైతం ఇదే విషయాన్ని ప్రకటించారు. మొన్నటికి మొన్న మంత్రివర్గ సమావేశానికి సైతం పవన్ హాజరు కాలేదు. తాజాగా చంద్రబాబు క్యాబినెట్ సహచరులు, శాఖల కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సైతం పవన్ హాజరు కాలేదు. ఈ సమయంలో మంత్రి మనోహర్ జోక్యం చేసుకొని పవన్ అనారోగ్యంతో బాధపడుతున్నారని.. అందుకే హాజరు కాలేదని తెలిపారు. దీనిపై స్పందించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో మాట్లాడేందుకు ప్రయత్నించానని చెప్పారు. కానీ ఆయన అందుబాటులోకి రాలేదని.. ఇప్పుడు ఎలా ఉన్నారు అంటూ మనోహర్ వద్ద ఆరా తీశారు. తాను స్వయంగా ప్రయత్నించిన పవన్ అందుబాటులోకి రాలేదని చంద్రబాబు బాహటంగానే చెప్పడం ఇప్పుడు చర్చకు దారితీసింది.
* రేటింగ్స్ ఇవ్వడం పై ఆగ్రహం
మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు( CM Chandrababu) మంత్రులకు రేటింగ్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే పవన్ లేని సమయంలో ర్యాంకుల ప్రకటనపై జనసేనతో పాటుగా రాజకీయంగాను చర్చ జరిగింది. అయితే ఇంతలో శాఖలకు సంబంధించి కార్యదర్శులతో సమావేశం జరిగింది. పవన్ కళ్యాణ్ నిర్వర్తిస్తున్న శాఖలకు సంబంధించి ఫైళ్ల పెండింగ్ పై చర్చకు వచ్చింది. ఇదే సమయంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులకు ర్యాంకింగ్స్ ఇవ్వడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని.. ఎవరిని తక్కువ చేయడమో.. ఎవరిని ఎక్కువ చేయడమో అన్నది ఉద్దేశం కాదని.. చెప్పుకొచ్చారు చంద్రబాబు. దీంతో సీఎం కామెంట్స్ సైతం వైరల్ అయ్యాయి. అత్యున్నత సమావేశానికి గైర్హాజరవుతూ పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శనకు వెళ్లడం ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న.
* అనేక రకాల అనుమానాలు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) ఇటీవల జరిగిన పరిణామాలతో కలత చెందారని.. ఆగ్రహంగా ఉన్నారని ప్రచారం నడుస్తోంది. గత కొంతకాలంగా కూటమిలో కొద్దిపాటి విభేదాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ తో చర్చించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది జనసేన వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో ఏకంగా సీఎం చంద్రబాబు.. తాను ప్రయత్నించినా పవన్ కళ్యాణ్ అందుబాటులోకి రాలేదని చెప్పడంతో ఈ అనుమానాలు మరింత పెరిగాయి. కూటమి తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి.