Pawan Kalyan political strategy: ప్రతి పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంటుంది. సామాజిక వర్గాల వెన్నుదన్ను కూడా పార్టీలకు ఉంటాయి. అయితే కాంగ్రెస్( Congress) ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి అండగా నిలిచింది గిరిజనులు. ఎందుకంటే గిరిజన సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాలు సానుకూల నిర్ణయాలు తీసుకునేవి. మన రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కనుమరుగైన తర్వాత.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు ఇష్టమైన పార్టీగా నిలిచిపోయింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ పట్ల వారు పెద్దగా ఆసక్తి చూపరు. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేది. అటు తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు పరిస్థితిలో క్రమేపి మార్పు కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో జనసేన మాట వినిపిస్తోంది. దానికి కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గిరిజన ప్రాంతాలకు ప్రభుత్వ పరంగా.. చివరకు గిరిజనులకు వ్యక్తిగతంగా కూడా అండగా నిలుస్తున్నారు పవన్ కళ్యాణ్. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో జనసేన బలపడడం ఖాయంగా తెలుస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన ఓటమి ఎదురవుతుండడంతో.. దాదాపు ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలన్నింటినీ జనసేనకు విడిచి పెట్టే అవకాశం కనిపిస్తోంది.
జనసేన బోణీ
రాష్ట్రంలో ఏడు ఎస్టి రిజర్వుడు ( St reserved) నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో పాలకొండ, సాలూరు, కురుపాం, అరకు, పాడేరు, రంపచోడవరం, పోలవరం నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే పాలకొండలో ఇప్పటికే జనసేన మొన్నటి ఎన్నికల్లో గెలిచింది. అయితే ఇప్పటికే టిడిపి పట్ల గిరిజనుల్లో సానుకూలత లేదు. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వచ్చింది. కానీ అందులో మార్పు తేవాలని పవన్ ఆలోచన చేశారు. అందుకే గిరిజన ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. గిరిజన గ్రామాలతో పాటు కొండ శిఖర గ్రామాలకు రహదారులు నిర్మిస్తున్నారు. డోలి మోతలు లేకుండా, వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపడేలా మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వ్యక్తిగతంగాను సాయం చేస్తూ… వారి అభిమానాన్ని చూరగొంటున్నారు.
గతసారి కూటమికి ఐదు స్థానాలు..
గడిచిన ఎన్నికల్లో ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress) పార్టీ గెలిచింది. ఏడు ఎస్టి రిజర్వుడ్ నియోజకవర్గాలకు గాను రెండు చోట్ల విజయం సాధించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే అనుకోని విధంగా కురుపాంతో పాటు సాలూరులో గెలిచింది టిడిపి. పోలవరం లోను టిడిపి చాలా రోజులకు గెలిచింది. పాలకొండలో మాత్రం జనసేన విజయం సాధించింది. విశాఖ మన్యంలోని అరకు, పాడేరులో వైసిపి గట్టి ఎక్కింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఆ ఏడు సీట్లలో జనసేన గెలవాలన్నది పవన్ కళ్యాణ్ ప్రణాళిక. ఆ సీట్ల విషయంలో తెలుగుదేశం పార్టీకి సైతం ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. పైగా వచ్చే ఎన్నికల నాటికి సీట్లు పెంచాల్సిన అవసరం ఉంది జనసేనకు. అందుకే ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో సర్దుబాటు చేసేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి ఆ ప్రయత్నం ఎంత వరకు వర్కౌట్ అవుతుందో?