Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) కీలక నిర్ణయం తీసుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ తరుపున సత్తా చాటాలని చూస్తున్నారు. భారీ వ్యూహంతో రేపటి నుంచి కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ వారాహి దీక్ష చేపట్టారు. తిరుపతి లడ్డూ వివాదం వేళ ప్రాయశ్చిత్త దీక్షకు సైతం దిగారు. అప్పట్లో సనాతన ధర్మం గురించి పవన్ చేసిన వ్యాఖ్యలు జాతీయస్థాయిలో చర్చకు దారితీసాయి. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. దీనికి జాతీయ స్థాయిలో మద్దతు వెల్లువెత్తింది. హిందుత్వవాదులు, మత పీఠాధిపతులు ఆహ్వానించారు.
* దక్షిణాది రాష్ట్రాల్లో
అయితే పవన్ కళ్యాణ్ తాజాగా మరో నిర్ణయానికి వచ్చారు. దక్షిణాది రాష్ట్రాల్లో( South States) ఉన్న ప్రముఖ ఆలయాలను సందర్శించేందుకు డిసైడ్ అయ్యారు. ఈనెల 12వ తేదీ నుంచి దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు సిద్ధమయ్యారు. కేరళ తో పాటు తమిళనాడులోని ఆలయాల సందర్శనకు సిద్ధపడ్డారు. ఈ నెల 12 నుంచి నాలుగు రోజులపాటు ఆ రెండు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ ఆలయాల సందర్శన వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా బీజేపీ తరుపున హిందుత్వ వాదాన్ని బలంగా వినిపించేందుకే పవన్ ఆలయాల సందర్శనని ప్రచారం నడుస్తోంది.
* నాలుగు రోజుల పాటు పర్యటన
నాలుగు రోజుల పాటు తమిళనాడుతో( Tamil Nadu ) పాటు కేరళలోని ప్రముఖ ఆలయాలను సందర్శిస్తారు పవన్ కళ్యాణ్. ఇది పూర్తిగా ప్రైవేటు పర్యటన అని తెలుస్తోంది. నాలుగు రోజులపాటు జరిగే పవన్ పర్యటనలో అనంతపద్మనాభ స్వామిని ముందుగా దర్శించుకుంటారని తెలుస్తోంది. మధుర మీనాక్షి, పరుస రామస్వామి, ఆగస్త్య జీవ సమాధి కుంభేశ్వర స్వామి ఆలయం, స్వామి మలైయ్, తిరుత్తయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను పవన్ దర్శించుకుంటారని తెలుస్తోంది. పవన్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు డిమాండ్ విషయంలో ఇప్పటికే అందరూ ఆహ్వానించారు. ఇప్పుడు దీనికి మరింత మద్దతు కూడగట్టేందుకు పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శనకు దిగుతున్నట్లు తెలుస్తోంది.
* బిజెపి భారీ వ్యూహం
అయితే పవన్ ఆలయాల సందర్శన వెనుక బిజెపి ( Bhartiya Janata Party)వ్యూహం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు డిమాండ్ కు ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలు సైతం మద్దతు ఇచ్చారు. పవన్ తాజా పర్యటన దేవాలయాల సందర్శన కోసమే అయినా.. దీని వెనుక బీజేపీ వ్యూహం స్పష్టంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి బలోపేతానికి పవన్ నడుం బిగించారని.. అందులో భాగంగానే ఆలయాల సందర్శనకు దిగినట్లు ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో బిజెపి పట్టు బిగిస్తోంది. కేరళ తో పాటు తమిళనాడులో ఉనికి చాటుకోవాలని భావిస్తోంది. దానిని పవన్ ద్వారా అమలు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.