Pawan Kalyan: పశ్చిమగోదావరి జిల్లా( West Godavari district) భీమవరం డిఎస్పి జయసూర్య వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆయనపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో పవన్ కళ్యాణ్ స్పందించారు. నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఫిర్యాదును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ అంశంపై హోంమంత్రి, డీజీపీలతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. డీఎస్పీ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ పరిణామాన్ని వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక మీడియా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తోంది. దీనిపై ఏకంగా హోంమంత్రి వంగలపూడి అనిత ఫైరయ్యారు కూడా.
* పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదులు.. భీమవరం( Bhimavaram ) ప్రాంతంలో పేకాట శిబిరాలు వంటి అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని.. వాటికి డిఎస్పి అండగా ఉంటున్నారని పవన్ కు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. డీఎస్పీ జయసూర్య తన పరిధి దాటి సివిల్ వివాదాలలో సైతం జోక్యం చేసుకుంటున్నారని.. కొందరి పక్షం వహిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అధికార కూటమి నేతల పేరును, ముఖ్యంగా జనసేన పార్టీ నేతల పేరును వాడుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు రావడంతో పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జయసూర్య వైసిపి హయాంలో గన్నవరం డిఎస్పీగా పని చేశారు. ఆ సమయంలో ఆయన వైసీపీకి విధేయత చూపారని.. కొంతమంది నేతల ద్వారా భీమవరంలో పోస్టింగ్ పొందారు అన్నది ప్రచారంలో ఉంది. ఆయనపై నేరుగా ఫిర్యాదులు రావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గా స్పందించారు. నేరుగా పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. డీఎస్పీపై వచ్చిన ఆరోపణలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. డీఎస్పీపై వచ్చిన ఆరోపణల విషయాన్ని హోం శాఖామంత్రి అనితకు.. డిజిపి కి తెలియజేసి ఆయన వ్యవహారం పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
* విలేఖర్లకు చురకలు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( deputy CM Pawan Kalyan)చేసిన ఫిర్యాదును సీఎం చంద్రబాబు సైతం సీరియస్ గా తీసుకున్నారు. శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అంశాలు రావడం పై ఆయన హోంమంత్రి, డిజిపిలను పిలిపించుకుని మాట్లాడారు. సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు శాంతిభద్రతల విషయమై హోంమంత్రి వంగలపూడి అనిత ప్రెస్ మీట్ పెట్టారు. డిప్యూటీ సీఎంకు ప్రత్యేక అధికారాలు లేవని.. అటువంటిది ఆయన హోం శాఖ పరిధిలోకి ఎలా వస్తారని.. ఆయన నేరుగా ఆదేశాలు ఇవ్వడం ఏంటని హోంమంత్రి వంగలపూడి అనితను ప్రశ్నించారు. హోం మంత్రిగా సమాచారం ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై వంగలపూడి అనిత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. వైసిపి ప్రభుత్వ హయాంలో కనీసం సీఎం జగన్మోహన్ రెడ్డిని ఈ తరహా ప్రశ్నలు వేశారా అని ప్రశ్నించారు. తాము ఎన్డీఏ కూటమిగా ముందుకు వెళ్తున్నామని.. తమ మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారా అని ఎదురు ప్రశ్న వేశారు. ప్రతి అంశము తమ దృష్టికి వచ్చిందని.. అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని తేల్చి చెప్పారు. విలేకరులకు చిన్నపాటి చురకలు అంటించారు.