Ali: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీలో సినీ నటుడు ఆలీ యాక్టివ్ కాబోతున్నారా? తిరిగి పార్టీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారా? వచ్చే ఎన్నికల నాటికి మరింత క్రియాశీలకం అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా రాజకీయ వేదికలకు దూరంగా ఉన్నారు అలీ. తన సినిమా లేదో తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అటువంటి అలీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అప్పటి నుంచి రకరకాల చర్చ ప్రారంభం అయింది. పొలిటికల్ రీఎంట్రీ పై ఊహాగానాలు మొదలయ్యాయి.
* టిడిపిలో ఎక్కువ కాలం..
తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) సుదీర్ఘకాలం ఉండేవారు అలీ. ఆ పార్టీ ద్వారా చట్టసభలకు ఎన్నిక కావాలని భావించారు. కానీ అది సాధ్యం కాలేదు. దీంతో 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున పోటీ చేయాలని భావించారు. కానీ ఆయనకు అవకాశం దక్కలేదు. అయితే వైసిపి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది కూడా. దీంతో అలీకి ఎమ్మెల్సీ తో పాటు రాజ్యసభలో ఏదో ఒక పదవి వస్తుందని అంతా భావించారు. ప్రతిసారి ఆయన పేరు ప్రముఖంగా వినిపించేది. చివరకు ఆయనకు ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ సలహాదారు పదవి లభించింది. అయితే 2024 ఎన్నికల్లో ఆయన ప్రచారం చేశారు వైసీపీ తరఫున. పార్టీ ఓడిపోయేసరికి తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ప్రకటన చేశారు. అప్పటినుంచి సినిమాలపై ఫోకస్ పెట్టారు.
* వంశీని కలిసిన అలీ.
అయితే తాజాగా గన్నవరం( Gannavaram) మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను కలిశారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వల్లభనేని వంశీ మోహన్ సుదీర్ఘకాలం జైల్లో ఉండి బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఆయన రాజకీయాలతో పాటు సినిమాలను సైతం నిర్మించారు. అందుకే వల్లభనేని వంశీ మోహన్ తో అలీకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ తరుణంలోనే జైలుకు వెళ్లి అనారోగ్యానికి గురైన వంశీ కోరుకుంటున్నారు. అందుకే అలీ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో రాజకీయ ప్రాధాన్యం లేదని తెలుస్తోంది. మరోవైపు వల్లభనేని వంశీ మోహన్ సైతం గన్నవరం నియోజకవర్గంలో యాక్టివ్ కాలేదు. త్వరలో ఆయన నియోజకవర్గంలో పర్యటించి పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తారట. అయితే అలీ మాత్రం కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్త చర్చకు కారణం అవుతోంది.