Pawan Kalyan Serious About Nagababu: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు సమీపిస్తోంది. మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం నడుస్తోంది. నాయకత్వం సమన్వయంతో వ్యవహరిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కూటమిలో చిన్నచిన్న అరమరికలు ఉన్నాయి. ప్రభుత్వపరంగా బాగానే ఉన్నా.. ప్రతిపక్షం నుంచి విమర్శలు వచ్చినప్పుడు.. విధానపరమైన అంశాలు మాట్లాడేటప్పుడు ఎవరికి వారే యమునకు తీరే అన్నట్టు ఉన్నారు. ప్రస్తుతం తిరుమల లడ్డూ వివాదం నడుస్తోంది. అయితే అది తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారమని భావిస్తున్నారు జనసేన నేతలు. అందుకే తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడిన విధంగా కూడా జనసేన నేతలు స్పందించడం లేదు. దానిని తప్పు పట్టారు పవన్ కళ్యాణ్. ఒకానొక దశలో తన సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబుపై కూడా సీరియస్ అయ్యారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల శ్రీనివాస్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది.
* జనసేన విస్తృత స్థాయి సమావేశంలో..
జనసేన( janasena) విస్తృత స్థాయి సమావేశం నిన్ననే జరిగింది. మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎంపీలు,ఎమ్మెల్సీలు, కీలక నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ సీరియస్ గా మాట్లాడారు. పదవులు వచ్చిన వరకు ఒకలా ఉన్నారని.. పదవులు వచ్చాక మరోలా వ్యవహరిస్తున్నారని.. అందరి జాతకాలు తన దగ్గర ఉన్నాయని కూడా ఘాటుగా హెచ్చరించారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహార శైలిపై కూడా పవన్ మాట్లాడినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత అంశాలను పార్టీ వరకు తీసుకురావద్దని.. పార్టీకి నష్టం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వంలో జనసేన ఒక భాగం అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. టిడిపి నేతల సమావేశాలకు హాజరుకావాలని.. అక్కడ ఉన్న పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు పవన్.
* వైసిపి విమర్శలపై స్పందించరేమి?
మరోవైపు టీటీడీ( Tirumala Tirupati Devasthanam) లడ్డూ తయారీకి సంబంధించి నెయ్యిలో జంతు కొవ్వు కలిపారు అన్న వివాదం తుది దశకు చేరుకుంది. ఈ అంశం పైన ఇప్పుడు రాజకీయ రగడ నడుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అదే పనిగా చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకుంది. అయితే టిడిపి శ్రేణులు దీనిపై బాగా రియాక్ట్ అవుతున్నాయి. కానీ జనసేన నుంచి మాత్రం ఆ స్థాయిలో కౌంటర్ అటాక్ లేదు. దీనినే తప్పు పట్టారు పవన్ కళ్యాణ్. తనపై విమర్శలు చేస్తుంటే మీరంతా ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. ఆడవారి వస్త్రధారణ పై మాట్లాడడానికి సమయం ఉంటుంది కానీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి సమయం లేదా అంటూ నాగబాబును నిలదీసినంత పని చేసినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు లండన్ పర్యటనకు వెళ్లిన కాకినాడ ఎంపీ తంగెళ్ల శ్రీనివాసును సైతం తప్పు పట్టినట్లు తెలుస్తోంది. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సమయం ఉంది కానీ.. వైసీపీ విమర్శలను తిప్పికొట్టే సమయం లేదా అంటూ అడిగేసరికి ఎంపీ చిన్నబోయినట్లు సమాచారం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టే ఛాన్స్ లేదని.. కూటమి పరంగా మూడు పార్టీలు అటాక్ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్. మొత్తానికి అయితే వైసిపి హయాంలో జనసైనికులకు గట్టిగానే సూచనలతో పాటు ఆదేశాలు ఇచ్చారు పవన్.