Pawan Kalyan: వంగా గీతను జనసేనలోకి ఆహ్వానించిన పవన్

వంగా గీత సీనియర్ నాయకురాలు. 2009లో ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. పిఠాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా కూడా వ్యవహరించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంట నడిచారు.

Written By: Dharma, Updated On : March 20, 2024 11:02 am

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లో నిన్న ఒక ఆసక్తికరమైన పరిణామం జరిగింది. తనపై పోటీ చేస్తున్న వ్యక్తి విషయంలో పవన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వంగా గీత జనసేన లో ఉండాల్సిన నేత అంటూ పవన్ వ్యాఖ్యానించడం పెను దుమారానికి దారితీసింది. ప్రస్తుతం ఆమె పిఠాపురం వైసిపి అభ్యర్థి. ఇక్కడి నుంచి పవన్ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సాధారణంగా రాజకీయ ప్రత్యర్థి పై ఆరోపణలు చేయాలి. ఆమె వైఫల్యాలను ఎండగట్టాలి. కానీ పవన్ అలా చేయలేదు. ఆమె గౌరవమైన మహిళా నేతగా అభివర్ణించారు. ఆమె ఉండే పార్టీని మాత్రమే తప్పు పట్టారు. ఆమెను జనసేనలోకి ఆహ్వానించారు. దీంతో పవన్ కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనానికి కారణమవుతున్నాయి.

వంగా గీత సీనియర్ నాయకురాలు. 2009లో ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. పిఠాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా కూడా వ్యవహరించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంట నడిచారు.రాజ్యసభ సభ్యురాలుగా కూడా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. మిగతా నాయకులతో పోల్చుకుంటే వంగా గీత హుందాగా రాజకీయాలు నడుపుతుంటారు. గత ఐదేళ్లలో జనసేన ను ఎప్పుడు టార్గెట్ చేయలేదు. పవన్ పై వ్యక్తిగత కామెంట్స్ కు దిగలేదు. ఇటు జనసేన నుంచి కూడా ఈ రకమైన విమర్శలు వంగా గీత పై లేవు. అయితే ఇప్పుడు పవన్ కు ఆమె ప్రత్యర్థి కావడం.. పవన్ ఆమెపై సానుకూల వ్యాఖ్యలు చేయడం విశేషం.

అయితే వంగా గీత నుంచి సానుకూల సంకేతాలు రావడంతోనే పవన్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని తెలుస్తోంది. గీత పై ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా.. కేవలం ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీని మాత్రమే పవన్ విమర్శలు చేశారు. అంటే రేపు పొద్దున ఎన్నికల ఫలితాలు వచ్చాక.. ఫలితాలు తారుమారైతే వంగా గీత తప్పకుండా జనసేన లో చేరే అవకాశం ఉందని పవన్ మాటలు బట్టి తెలుస్తోంది. ఇప్పటికే జనసేన ప్రభావం ఉభయగోదావరి జిల్లాల్లో అధికంగా ఉంటుందని ఒక అంచనా ఉంది. చాలామంది నాయకులు వైసీపీ తరఫున పోటీ చేసేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. అలాగని రాజకీయ కారణాలతో జనసేనలో చేరలేదు. ఇటువంటి నాయకుల్లో వంగా గీత కూడా ఒకరు. ఇప్పటికే ఆమెకు ఫలితం పై ఒక అవగాహన ఉందని.. తన పార్టీ అధికారంలోకి రాకపోయినా.. జనసేన ఒక ఆప్షన్ గా ఉందని చెప్పేందుకే పవన్ ఆమెకు సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. దీనిపై వంగా గీత ఎలా స్పందిస్తారో చూడాలి.