Pawan Kalyan: ఏపీలో కీలక నేతలందరికీ సొంత నియోజకవర్గాలు ఉన్నాయి. కుప్పం నుంచి చంద్రబాబు, పులివెందుల నుంచి జగన్, హిందూపురం నుంచి బాలకృష్ణ.. ఇలా చెప్పుకుంటూ పోతే నేతల పేర్లు చెబితే చాలు వారి నియోజకవర్గాల పేర్లు ఇట్టే చెప్పవచ్చు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైతం పిఠాపురం నియోజకవర్గాన్ని సొంతదిగా భావిస్తున్నారు. శాశ్విత నియోజకవర్గంగా మార్చుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం ఆయన పిఠాపురంలోనే నివాసం ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తద్వారా నాన్ లోకల్ అన్న ముద్ర లేకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఓ ఇంటిని తీసుకొని ఉగాదినాడు గృహప్రవేశం చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కు నిరాశ ఎదురైంది. గాజువాకతో పాటు భీమవరం నియోజకవర్గంలో సైతం పవన్ ఓడిపోయారు. ఎన్నికల్లో పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాలపై రకరకాల ప్రచారం సాగింది. వాటన్నింటినీ తెరదించుతూ పవన్ పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అక్కడినుంచి కచ్చితంగా గెలిచి తీరుతానని ధీమాతో ఉన్నారు. అయితే పవన్ గెలిచాక తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతారని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. దీంతో పిఠాపురం నియోజకవర్గంలోనే నివాసం ఏర్పాటు చేసుకోవాలని పవన్ భావించారు. ఒక కొత్త ఇల్లును కొనుక్కున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా స్థానికంగా ఉంటూ.. మధ్యలో హైదరాబాద్ వెళ్లి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
గొల్లప్రోలు మండలంచేబ్రోలులో కొత్తగా నిర్మిస్తున్న నాలుగు అంతస్తుల ఇల్లును పవన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓదూరి నాగేశ్వరరావు అనే వ్యక్తి నిర్మిస్తున్న ఈ ఇంటిని పవన్ కొనుగోలు చేశారా? లేక లీజుకు తీసుకున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. కానీ చేబ్రోలులో పవన్ ఇల్లు తీసుకున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇంటికి సంబంధించి మెరుగులు దిద్దే పనులు చురుగ్గా జరుగుతున్నాయి.
జ్వరం బారిన పడిన పవన్ పిఠాపురంలో ఎన్నికల ప్రచార సభలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన జ్వరం నుంచి చేరుకోవడంతో.. రేపటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని తిరిగి మొదలు పెట్టనున్నారు. రేపు అనకాపల్లిలో పర్యటించనున్నారు. 8వ తేదీన ఎలమంచిలి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. ఉగాదినాడు పిఠాపురం వెళ్లి గృహప్రవేశం చేయనున్నట్లు తెలుస్తోంది. కానీ ఇంతవరకు జనసేన అధికారిక ప్రకటన అంటూ ఏమీ రాలేదు. జనసేన వర్గాలకు మాత్రం అంతర్గతంగా సమాచారం ఉంది. మొత్తానికి అయితే పవన్ విమర్శకుల నోటికి తాళం వేసేలా సొంత ఇంటిని సమకూర్చుకోవడం విశేషం.