Sunrisers Hyderabad: యువ యజమాని.. కొత్త కెప్టెన్.. అన్నీ మంచి శకునములే అన్నట్టుగా ఈ ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ జట్టు పరిస్థితి మారిపోయింది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో.. రెండు ఓటములు ఎదుర్కొని.. రెండు విజయాలను నమోదు చేసినప్పటికీ.. హైదరాబాద్ జట్టు ప్రత్యేకంగా నిలిచింది. ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 277 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. సొంత మైదానంలో ముంబై జట్టుపై చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. శుక్రవారం రాత్రి చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో.. ముందుగా బౌలింగ్ చేసి చెన్నై జట్టును 165 పరుగులకు పరిమితం చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించి.. కేవలం 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. అటు ముంబై బలమైన జట్టు.. ఇటు చెన్నై కూడా అంతకు మించిన జట్టు.. ఈ రెండు జట్లను హైదరాబాద్ మట్టి కరిపించింది. ప్రారంభ మ్యాచ్లో కోల్ కతా జట్టును ఓడించేదే. వెంట్రుక వాసిలో విజయాన్ని కోల్పోయింది. గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ దాదాపు ఇలాగే ఆడింది.
గత ఐపిఎల్ సీజన్లలో హైదరాబాద్ జట్టు ఆశించిన స్థాయిలో ఆట తీరు ప్రదర్శించలేదు. దీంతో జట్టు ఆటగాళ్లపై విమర్శలు మొదలయ్యాయి. యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం అయింది. ఈ నేపథ్యంలో వేలంలో ఆస్ట్రేలియా ఆటగా కమిన్స్ ను కొనుగోలు చేసింది హైదరాబాద్ యజమాని కావ్య మారన్. దీంతో అతడు జట్టు స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాడు.. గత సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. కమిన్స్ నాయకత్వంలో ప్రస్తుతం హైదరాబాద్ జట్టు సాగిస్తున్న ప్రయాణం పూర్తి విభిన్నంగా ఉంది. ఇప్పటివరకు ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్లుగా పేరుపొందిన ముంబై, చెన్నైని మట్టి కరిపించింది.
హైదరాబాద్ వేదికగా ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఏకంగా 277 పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. ఆ తర్వాత చెన్నై జట్టుపై ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్నారు.. ముందుగా బ్యాటింగ్ చేస్తే ఏ స్థాయిలో ఇన్నింగ్స్ ఆడతారో హైదరాబాద్ ఆటగాళ్లు ముంబై తో జరిగిన మ్యాచ్ లో చూపించారు. బౌలింగ్ ఎంచుకుంటే.. ఎలాంటి కట్టుదిట్టమైన బంతులు సంధిస్తారో చెన్నైతో జరిగిన మ్యాచ్ లో అనుభవంలోకి తెచ్చారు. బలమైన చెన్నై జట్టును 165 పరుగులకు పరిమితం చేశారంటే హైదరాబాద్ బౌలింగ్ స్థాయిని అర్థం చేసుకోవచ్చు.
ఈ సీజన్లో బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాదు ఫీల్డింగ్ విషయంలోనూ హైదరాబాద్ సత్తా చాటుతోంది. గతంలో విలువైన క్వాచ్ లను నేలపాలు చేసి, విజయావకాశాలను చేజేతులా నాశనం చేసుకున్న హైదరాబాద్ ఆటగాళ్లు.. ఈ సీజన్లో మాత్రం అలాంటి తప్పులు చేయడం లేదు. మైదానంలో మెరుపు తీగలు లాగా కదులుతున్నారు. చురుకుగా ఫీల్డింగ్ చేస్తూ బంతులను ఎక్కడికక్కడ ఆపుతున్నారు. బలమైన చెన్నై జట్టు కేవలం 165 పరుగులు మాత్రమే చేసింది అంటే దానికి కారణం బౌలింగ్ మాత్రమే కాదు.. హైదరాబాద్ ఆటగాళ్ల ఫీల్డింగ్ కూడా.. మొత్తానికి అటు చెన్నైని.. ఇటు ముంబైని ఓడించి.. నక్కల వేట కాదు.. ఏనుగుల కుంభస్థలాలే బద్దలు కొట్టామని హైదరాబాద్ నిరూపించింది.