Pawan Kalyan: వరణుడి కోపానికి తెలుగు రాష్ట్రాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. పక్షం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండ పోత వానలకు రెండు రాష్ట్రాల్లో పలు జిల్లాలు ప్రభావితమయ్యాయి. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. రైలు మార్గాలకు గండు పడ్డాయి. వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఇక వరదలతో ఊరే యేరు ఏకమవుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో అనేక గ్రామాలు నీట మునిగాయి. ఊళ్లను వరద చుట్టుముట్టడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఇక రెండు రాస్ట్రాల్లోని ప్రధాన నదులైన గోదావరి, కృష్ణా ఉగ్రరూపం దాల్చాయి. లక్షల క్యూసెక్కుల వరద ఈ నదులకు పోటెత్తుతోంది. దీంతో అనేక గ్రామాలు, పట్టణాలు జలమయమయ్యాయి. వరద బాధితులు పక్షం రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలోని విజయవాడ పరిస్థితి దారుణంగా మారింది. విజయవాడ నగరంలో సుమారు 40 శాతం పది రోజులుగా వరదలోనే ఉంది. ఇప్పటికీ పలు కాలనీల్లో నడుములోతు నీరు నిలిచింది. ఇక నాలుగు రోజులుగా తూర్పు, పశ్చిమ గోదావరి, శ్రీకాకులం జిల్లాలను వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఏపీ వ్యాప్తంగ వేల మంది నిరాశ్రయులయ్యారు. ఏజెన్సీ గ్రామాల్లో అయితే కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఇళ్లు కొట్టుకుపోతున్నాయి. ప్రభుత్వ సాయం కోసం ప్రజలు రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఉప ముఖ్యమంత్రీ వరద బాధితుడే..
వరదలతో అల్లాడుతున్న ఏపీకి అండగా నిలవాల్సిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఇపుపడు వరద బాధితుడయ్యారు. ఆయన ప్రాతినిధ్యం వహిసుతన్న పిఠాపురాన్ని కూడా వరదలు చుట్టుముట్టాయి. ఆయన ఇంటి స్థలం కూడా మునిగిపోయింది. ఎన్నికల సమయంలో అందరి దృష్టి ఆకర్షించిన నియోజకవర్గం పిఠాపురం. కారణం అక్కడి నుంచి జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ పోటీ చేయడమే. కూటమి సహాయంతో ఆయన భారీ మెజార్టీతో గెలవడంతో పిఠాపురం దశ మారుతుందని ఆశిస్తున్నారు. అయితే అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కావొస్తున్నా పిఠాపురంలో ఒక్క అభివృద్ధి పని చేయలేదని స్థానికులు చెబుతున్నారు. తాజాగా వరదలు చుట్టుముట్టాయి. ఈ సమయంలో నియోజకవర్గ ప్రజలకు అండగా నిలవాల్సిన డిప్యూటీ సీఎం ఒకరోజు వరద ప్రాంతాల్లో పర్యటించి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.
వరద తీవ్రం
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు ఉగ్రరూపం దాల్చింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటి స్థలం కూడా మునిగిపోయింది. పిఠాపురం గొల్లప్రోలు మధ్య 216 జాతీయ రహదారి పక్కన పవన్ ఇంటి స్థలం కొనుగోలు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచాక సొంత ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం 3 ఎకరాల 52 సెంట్లు స్థలం కొనుగోలు చేశారు. ఏలేరు వరద ప్రభావంతో ఇంటి నిర్మాణ స్థలం నీటి ముంపులో చిక్కుకుంది.
వరదల్లో చిక్కుకున్న ఆరుగురు
పిఠాపురం మండలం రాపర్తి వద్ద ఏలేరు గొరికి కండ్రి గండి తెగిపోయింది. దీంతో జమునపల్లి రాపర్తి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గండి తెగడంతో పోటెత్తిన వరద నీటిలో ఆరుగురు యువకులు చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా జములపల్లి గ్రామంలో 30 పశువులు వరద నీటిలో చిక్కుకున్నాయి. వరద నేపథ్యంలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆరుగురు యువకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.