Pawan Kalyan: జాతీయవాదాన్ని ప్రదర్శించడంలో పవన్ కళ్యాణ్ ముందుంటారు. ఒక రాష్ట్రం కంటే దేశం బలంగా ఉండాలని భావిస్తారు. ఆ దేశంలోనే రాష్ట్రం అంతర్భాగం అని చెప్పుకొస్తారు. అయితే పాపం ఆ జాతీయ భావంతోనే జాతీయ జెండాను ప్రదర్శించారు. అది ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా జరిగిన ర్యాలీలో ప్రదర్శించడంతో.. కోడ్ ఉల్లంఘనకు పాల్పడినట్లు విమర్శలు వస్తున్నాయి. ఏపీలో సార్వత్రిక ఎన్నికలవేళ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా పవన్ పిఠాపురం నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భారీ జన సందోహం నడుమ ప్రక్రియ కొనసాగింది. ఉత్సాహంగా సాగిన ర్యాలీలో జాతీయ జెండాను ఓచేతితో, కూటమి జండాలను మరో చేత్తో పట్టుకుని ప్రదర్శించారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ దీనిపై ఏ రాజకీయ పక్షం ఫిర్యాదు చేయకపోవడం విశేషం.
నిన్న అశేష జనవాహిని నడుమ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ నడుమ ముందుకు సాగారు. పలువురు సినీ ప్రముఖులు, బుల్లితెర నటులు హాజరయ్యారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో పవన్ ఉత్సాహంగా కనిపించారు. అదే సమయంలో ఓ చేత్తో జాతీయ జెండాతో పాటు మరో చేతిలో మూడు పార్టీల జెండాలను పట్టుకొని ఊపారు. అయితే ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టేనని నిపుణులు భావిస్తున్నారు. జాతీయ జెండాను పవన్ అగౌరవపరిచారన్న విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల ముంగిట ఇదో వివాదాస్పద అంశంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వాస్తవానికి జాతీయ జెండాను ఎవరైనా ప్రదర్శించవచ్చు. అయితే దాన్ని అత్యున్నత స్థానంలో, లేకుంటే ఎత్తులో ఉంచి ప్రదర్శించాలి. రాజకీయ పార్టీల జెండాలతో అస్సలు ప్రదర్శించకూడదు. ఒకవేళ జాతీయ జెండాను ప్రదర్శించినప్పుడు తప్పనిసరిగా కుడిచేతిలోనే ఉండాలి. కానీ పవన్ ఎడమ చేతితో ప్రదర్శించారన్న దృశ్యాలు వెలుగు చూశాయి. ఇలా చేస్తే తప్పకుండా అది కోడ్ ఉల్లంఘన కిందే వస్తుంది. దీనిపై రాజకీయ ప్రత్యర్థులు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది పవన్ కు ఇబ్బందికర పరిణామమే.