Deputy CM Pawan Kalyan : వైసిపి నేతలు ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని కూటమి ప్రభుత్వం వెయిట్ చేస్తోంది. ఏమాత్రం అవినీతి బయటపడినా విడిచిపెట్టడం లేదు. తాజాగా పేర్ని నాని కుటుంబం పై ఫోకస్ పెట్టింది. పెద్ద ఎత్తున రేషన్ బియ్యం పక్కదారి పట్టించినట్లు తేల్చింది. ఆయనతో పాటు కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు చేసింది. ఇప్పుడు మరో నేత సజ్జల రామకృష్ణారెడ్డి పై దృష్టి సారించింది. కడప జిల్లాలో సజ్జల కుటుంబం ఎస్టేట్లో అటవీ, డీకేటి భూములు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. సజ్జల కుటుంబ ఎస్టేట్లోని భూముల్లో అటవీ భూములు ఎన్ని అన్న నివేదిక ఇవ్వాలని కడప కలెక్టర్ను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీంతో ఇప్పుడు కలెక్టర్ ఇచ్చే నివేదిక కీలకం కానుంది. సజ్జల రామకృష్ణారెడ్డికి సీకే దీన్నే మండలం సుబాలిగిడికి సమీపంలో సుమారు 200 ఎకరాల్లో ఎస్టేట్ ఉంది. ఇప్పుడు ఈ ఎస్టేట్ పైనే వివాదం నడుస్తోంది. పెద్ద ఎత్తున అటవీ భూములు కలుపుకున్నారన్నది ప్రధాన ఆరోపణ.
* కుటుంబ సభ్యుల పేరిట వందల ఎకరాలు
సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు దివాకర్ రెడ్డి, ఆయన కుమారుడు సందీప్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యుల పేరుతో వందల ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో కొన్ని అటవీ భూములతో పాటు డీకేటి భూములు ఉన్నట్టు ఆరోపణలు తెరమీదకు వచ్చాయి. ప్రధానంగా సర్వేనెంబర్ 16029లో 40 ఎకరాల వరకు అటవీ భూములు ఉన్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ప్రస్తుతం భారీ కంచె, పెద్దపెద్ద గేట్లు పెట్టి లోపలికి ఎవరికీ అనుమతించడం లేదని తెలుస్తోంది. ప్రధాన గేటుకు ఎదురుగా సర్వేనెంబర్ 1612లో ఐదు ఎకరాల 14 సెంట్లు చుక్కల భూమి కూడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
* గతంలోనే ఫిర్యాదులు
గతంలో అక్కడ భూముల హక్కుదారులు వచ్చి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారు. గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారం వేడెక్కింది. మూడు రోజుల నుంచి పోలీస్ బలగాల సహాయంతో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సర్వే చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. మరోవైపు అధికారులు ఈరోజు నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది ఉత్కంఠ గా మారింది.