APSRTC : ఆర్టీసీ పై ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. ఎన్నికల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఉన్నత స్థాయి అధికార బృందాన్ని ఏర్పాటు చేసింది. వారు ఇతర ప్రాంతాల్లో అమలవుతున్న ఉచిత ప్రయాణం పై అధ్యయనం చేస్తున్నారు. వారిచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే ఇంతలో బస్సుల సంఖ్య పెంచడం, సిబ్బంది నియామకం పై దృష్టి పెట్టింది ఏపీ సర్కార్. ముఖ్యంగా ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టేలా రూట్ మ్యాప్ ఖరారు చేసింది. ఆర్టీసీకి కొత్తగా 1000 కి పైగా ఎలక్ట్రిక్ బస్సులు అందించనుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ బస్సులకు ప్రోత్సాహం అందించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర సాయంతోనే ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులను అందించేందుకు సిద్ధపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం.
* 1050 బస్సులు రాక
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 1050 బస్సులు ప్రవేశ పెట్టేందుకు టెండర్లు పిలిచారు. వీటిని త్వరలో ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం తిరుపతిలో మాత్రమే విద్యుత్ బస్సులు నిర్వహిస్తున్నారు. అధికారుల తాజా ప్రతిపాదనల మేరకు ఇకనుంచి అమరావతి, విజయవాడ, గుంటూరు, విశాఖ తో సహా పలు ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా ఈ బస్సులతో వాయు కాలుష్యం తగ్గుతుంది. చార్జీలు కూడా స్థిరంగా ఉండే అవకాశం ఉంది.
* డీజిల్ బస్సుల స్థానంలో
వచ్చే ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీఎం ఈ బస్ సేవ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిధులను సమకూర్చనుంది. అందులో భాగంగా ఏపీకి 1050 విద్యుత్ బస్సులను కేటాయించింది. ఇందుకోసం డిసెంబర్ 10న టెండర్లకు విలువగా.. పలు కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. త్వరలో టెండర్లు ఖరారు కానున్నాయి. కేంద్రం ఒక్కో బస్సుకు 35 లక్షల రూపాయల మేర సబ్సిడీ ఇస్తోంది. దశలవారీగా ఏపీకి ఈ బస్సులు అందరూ ఉన్నాయి. తొలుత 11 నగరాలకు 750 బస్సులు రానున్నాయి.