Pawan Kalyan: ఏదీ మోతాదుకు మించి చేయకూడదు. అది అన్నింటికి వర్తిస్తుంది. కానీ ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan ) గుర్తించడం లేదు. తనతో పాటు తన పార్టీని తగ్గించుకుంటున్నారు. అదే సమయంలో చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీని పైకి లేపుతున్నారు. ఇది జనసైనికులకు మింగుడు పడడం లేదు. కాపు సామాజిక వర్గం అంతకంటే జీర్ణించుకోలేకపోతోంది. తనకు ఏ కులంతో సంబంధం లేదని పవన్ కళ్యాణ్ చెబుతుంటారు. ఆయన అభిప్రాయం ఆయనది కానీ.. ఆయనకు కాపు సామాజిక వర్గం ఒక ఆరాధ్య నాయకుడిగా గౌరవిస్తుంది. కానీ పవన్ చర్యలు చూస్తుంటే మాత్రం ఆ సామాజిక వర్గంలో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది. దానికి కారణం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ ద్వారా రాజ్యాధికారం సాకారం చేసుకోవాలని చూస్తోంది కాపు సామాజిక వర్గం. కానీ ఆ బాధ్యత నుంచి తప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్.
Also Read: కొడాలి నానికి సర్జరీ.. పరిస్థితి ఎలా ఉందంటే?
* రాజ్యాధికారం కోసం ఆశలు..
రాష్ట్రంలో మెజారిటీ సామాజిక వర్గం కాపు( Kapu community). కాపు ఉప కులాల తో కలిపి దాదాపు 30% ఉంటారన్నది ఒక అంచనా. కానీ ఉమ్మడి ఏపీలో కానీ.. నవ్యాంధ్రప్రదేశ్లో కానీ కాపులకు ఇంతవరకు సీఎం పదవి దక్కలేదు. నిజంగా అది ఆ సామాజిక వర్గానికి పెద్ద లోటు. ఆ లోటును పవన్ కళ్యాణ్ ద్వారా భర్తీ చేయాలని కాపు సామాజిక వర్గం ప్రయత్నిస్తోంది. కానీ పవన్ చర్యలు అలా లేవు. తన పార్టీకి అంత బలం లేదని ఒకసారి చెబుతున్నారు.. మన పార్టీకి అంత సత్తా లేదని చెప్పుకొస్తున్నారు. తన పార్టీతోపాటు తనను కించపరుచుకుంటున్నారు. తక్కువ చేసి మాట్లాడుతున్నారు.
* తాజాగా అదే పొగడ్త
తాజాగా పి4 కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబును( CM Chandrababu) ఆకాశానికి ఎత్తేశారు. ఆయన గొప్పతనాన్ని మరోసారి చాటి చెప్పారు. విజినరీ నేతగా అభివర్ణించారు. తనకు అంత సత్తా లేదని ఒప్పుకున్నారు. అయితే చంద్రబాబును పొగడడం ఇదే తొలిసారి కాదు. సమయం సందర్భం లేకుండా పొగుడుతూనే ఉన్నారు. మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎం గా ఉంటారని తేల్చి చెప్పారు. సమర్థుడైన నేత చంద్రబాబు కాబట్టే ఆయనకు జనసేన మద్దతు ఇస్తుందని చెప్పుకొచ్చారు.
* ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత
అయితే పవన్ ( Pawan Kalyan)ఈ తరహా రాజకీయాలు చేయడాన్ని జనసైనికులు, కాపు సామాజిక వర్గం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నేత అనేవాడు అన్నింటి సమర్థవంతమైన వాడు కాలేడు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకత. సంక్షేమానికి ఆధ్యుడు నందమూరి తారకరామారావు. అటు తరువాత అంత మంచి పేరు తెచ్చుకున్నారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. చంద్రబాబు ఒక విజినరీ నేత. పాలన దక్షుడు. సంక్షేమానికి వ్యతిరేకి. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత సీఎం బాధ్యతలు తీసుకున్నారు రోశయ్య. అటు తరువాత మూడేళ్ల పాటు అధికారం చేపట్టారు కిరణ్ కుమార్ రెడ్డి. ఉద్యోగాల నియామకాల తో పాటు రాష్ట్రాన్ని బాగానే నడిపించారు. ఇలా ఒక్కో సీఎం ది ఒక్కో ప్రత్యేకత. కానీ పవన్ మాత్రం తనకు సీఎం అయ్యేందుకు తగిన సమర్థత లేదని తనలో ఉన్న బలహీనతను బయటపెడుతున్నారు. తన పార్టీ శ్రేణులను నియంత్రిస్తున్నారు. తనను అభిమానించే కాపు సామాజిక వర్గానికి నిరాశను మిగుల్చుతున్నారు. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ సీఎం కాగలరా? లేదా? అని అనుమానం వచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఇదే అనుమానం బలపడితే మాత్రం అభిమానించే వర్గాలు దూరం అవ్వక తప్పదు. ఇక తెలుసుకోవాల్సింది పవన్ కళ్యాణ్.