Pawankalyan : టీడీపీ, బీజేపీ మధ్య గ్యాప్ సెట్ చేసే పనిలో పవన్

టీడీపీ, బీజేపీల మధ్య పొత్తులు సెట్ రైట్ అవుతున్న సమయంలో తెలంగాణ అంశం ప్రతిష్ఠంభనకు కారణమవుతోంది. ఏపీలో పొత్తులు పెట్టుకోవాలంటే.. ముందుగా తెలంగాణలో పెట్టుకోవాలని బీజేపీ షరతు పెట్టినట్టు తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : July 19, 2023 12:24 pm
Follow us on

Pawankalyan : పవన్ ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి పవన్ హాజరైన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఏపీ రాజకీయాలపై చర్చిస్తానని పవన్ చెప్పడంతో సమావేశంపై అంచనాలు పెరిగాయి. ఏపీలో పొత్తులపై కీలక ప్రకటన వెలువడుతుందని అంతా భావించారు. కానీ ఆ సమావేశం కేవలం జాతీయ స్థాయిలో ఎన్డీఏ బలోపేతంపైనే సాగింది. ఏపీపై ప్రత్యేకంగా చర్చించే చాన్స్ రాలేదు. దీంతో స్పష్టత వస్తుందనుకున్న అంశం.. మరింత ఉత్కంఠను పెంచింది. కానీ పవన్ ఢిల్లీ షెడ్యూల్ మరో రోజు పెరగడంతో ఏపీలో పొత్తుల అంశం తేల్చేందుకేనన్న టాక్ ప్రారంభమైంది.

ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి నడవాలన్నదే చంద్రబాబు, పవన్ అభిమతం. ఇరువురు నాయకులు చాలా సందర్భాల్లో ఇటువంటి అభిప్రాయాన్నే వెల్లడించారు. నిన్నటి ఢిల్లీ సమావేశం ముందు సైతం పవన్ అందరూ కలిస్తేనే అన్న కామెంట్ చేశారు. బీజేపీ, టీడీపీ మధ్య గ్యాప్ ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ఆ గ్యాప్ ను సెట్ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న సమావేశమైనా .. ఈ రోజు సైతం ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నట్టు సమాచారం. నిన్న సమావేశం ముగిసే నాటికే కేంద్ర పెద్దల అపాయింట్మెంట్లు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇది పొత్తుల కోసమే అన్న ప్రచారం ఊపందుకుంది.

బీజేపీ పెద్దలు పెద్ద వ్యూహంతో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. 2024 లో బీజేపీ, జనసేన గట్టిగా పోరాడితే.. 2029లో కూటమి అధికారంలోకి వచ్చే చాన్స్ ఉన్నట్టు ఢిల్లీ పెద్దలు అంచనాకు వచ్చారు. కానీ పవన్ మాత్రం వేరే అభిప్రాయంతో ఉన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేన-బీజేపీ ఇద్దరికీ కలిగే ప్రయోజనాన్ని కాషాయ పెద్దల దృష్టికి పవన్ తీసుకెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో బలమైన కూటమి ఏర్పాటు చేస్తానని ఎప్పటి నుంచో చెబుతున్న పవన్.. అది కుదరకపోతే ఏం జరగబోతోందో క్షేత్రస్ధాయి రిపోర్టులతో బీజేపీ పెద్దలకు వివరించేందుకు సిద్దమవుతున్నారు. గతంలోనూ బీజేపీ పెద్దల్ని ఓసారి కలిసిన తర్వాత అమిత్ షా-చంద్రబాబు భేటీ జరిగిన విషయాన్ని గుర్తించుకోవాలి. ఈసారి కూడా అదే రిపీట్ అవుతుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

టీడీపీ, బీజేపీల మధ్య పొత్తులు సెట్ రైట్ అవుతున్న సమయంలో తెలంగాణ అంశం ప్రతిష్ఠంభనకు కారణమవుతోంది. ఏపీలో పొత్తులు పెట్టుకోవాలంటే.. ముందుగా తెలంగాణలో పెట్టుకోవాలని బీజేపీ షరతు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే కర్నాటక ఎన్నికల తరువాత తెలంగాణలో బీజేపీ ప్రభ తగ్గింది. కాంగ్రెస్ బలోపేతమవుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ఇటువంటి సమయంలో తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ప్రతికూల ఫలితాలు వస్తాయని టీడీపీ భావిస్తోంది. అదే జరిగితే ఆ ప్రభావం ఏపీపై చూపే అవకాశముంది. అందుకే చంద్రబాబు తెలంగాణతో సంబంధం లేకుండా ఏపీ వరకే పొత్తుపెట్టుకోవాలని చూస్తున్నారు. ఇన్ని లెక్కల మధ్య టీడీపీ, బీజేపీ మధ్య ఉన్న గ్యాప్ ను పూడ్చే పనిలో పడ్డారు పవన్. అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.