Pawan Kalyan : ఏపీ ప్రభుత్వం( AP state government) మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేసింది. ముఖ్యంగా పంచాయితీ వ్యవస్థలో సమూల ప్రక్షాళన తీసుకురావాలని భావిస్తోంది. చాలా పంచాయితీల్లో సిబ్బంది లేక ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. మరోవైపు ఆదాయం కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఈ తరుణంలో సిబ్బంది కొరత అధిగమించడంతో పాటు సమన్వయానికి క్లస్టర్ విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు అమలవుతున్న విధానంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్న దృష్ట్యా.. కొత్త క్లస్టర్ విధానాన్ని అమల్లోకి తేవాలని అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించి కార్యాచరణలో పడ్డారు పంచాయతీరాజ్ అధికారులు. ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష పవన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
* జోరుగా ‘పల్లె పండుగ’ పనులు
పవన్ పంచాయితీరాజ్( Panchayati Raj ), గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు తీసుకున్నాక చాలా రకాల మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా 4,500 కోట్ల రూపాయలకు సంబంధించి ఉపాధి హామీ నిధులను గ్రామాల అభివృద్ధికి ఉపయోగించాలని పవన్ డిసైడ్ అయ్యారు. గతంలో ఈ నిధులు పక్కదారి పట్టేవి. ఇతర సంక్షేమ పథకాలకు సర్దుబాటు చేసేవారు. కానీ ఈసారి మాత్రం అటువంటి పరిస్థితి లేకుండా చూడాలని పవన్ భావించారు. అందుకే రహదారులతో పాటు కాలువల నిర్మాణానికి ఆ నిధులు కేటాయించారు. పల్లె పండుగ పేరిట పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు.
* ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ
స్థానిక సంస్థలను( local bodies) మరింత బలోపేతం చేయడానికి పవన్ ఎంతగానో పరితపిస్తున్నారు. అందులో భాగంగానే గతంలో నిలిచిపోయిన ఆర్థిక సంఘం నిధులను.. నేరుగా పంచాయితీ ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమ అయ్యాయి. వాటితో ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పంచాయితీల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇందుకుగాను ప్రత్యేక నిధులు కూడా కేటాయించారు. ఇలా పంచాయితీల విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు పవన్ కళ్యాణ్.
* పంచాయితీలు మరింత బలోపేతం
సచివాలయ వ్యవస్థ( Secretariat system) వచ్చిన తర్వాత పంచాయతీలు నిర్వీర్యం అయ్యాయి. నామమాత్రంగా మారాయి. ఈ తరుణంలోనే పూర్వవైభవం దిశగా అడుగులు వేయాలని పవన్ భావించారు. అందుకే పంచాయితీల ఆదాయ మార్గాలు పెంచడంతోపాటు సేవలను మరింత విస్తృతం చేయాలని భావించారు. ముఖ్యంగా ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు.. క్లస్టర్ విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బందితో పాటు తాగునీటి నిర్వహణ, వీధి దీపాల నిర్వహణను సక్రమంగా చేపట్టాలని గట్టిగా నిర్ణయించారు. అందుకే వీలైనంత త్వరగా పంచాయితీల విషయంలో పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి నివేదికలు ఇవ్వాలని.. తద్వారా చేర్పులు, మార్పులు చేయాలని నిర్ణయించారు. మొత్తానికి అయితే పవన్ పుణ్యమా అని పంచాయతీ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుండడం గమనించదగ్గ విషయం.
* క్లస్టర్ల గ్రేడింగ్ ఇలా
చాలా పంచాయితీలకు ఆదాయం తక్కువగా ఉంటుంది. కానీ జనాభా ఎక్కువగా ఉంటారు. జనాభా ప్రాతిపదికగా తీసుకుంటే అటువంటి పంచాయితీల మనుగడ కష్టం. ఇంకోవైపు చాలా పంచాయితీలకు ఆదాయం సమకూరుతుంది. కానీ అక్కడ జనాభా తక్కువగా ఉంటారు. మౌలిక వసతుల కల్పనకు ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే ఆదాయం, జనాభాను పరిగణలోకి తీసుకొని.. క్లస్టర్లుగా విభజిస్తారు. గ్రేడింగ్ చేస్తారు. అందుకు అనుగుణంగా నిధుల విడుదల, సిబ్బంది నియామకాలు చేస్తారు.