Pawankalyan : పవన్ చర్యలు ఊహకందవు.. తానే ఒక ఊహాతీతుడు.ఎటువంటి వ్యూహాలుండవు. కానీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. సమయానుకూలంగా మాట్లాడతారు. ఆ మాటలతో ప్రత్యర్థుల ఫీజులు ఫిలమెంటలు రాలిపోయేలా విమర్శనాస్త్రాలు సంధిస్తారు. సామాజిక రుగ్మతలపై ఎమోషనలవుతారు. అదే స్థాయిలో స్పందిస్తారు. అలాంటి సమయంలో లాభ, నష్టాలు భేరీజు వేసుకోరు. కానీ తనవారికి, తానూ అనుకున్న వారికి కష్టం వస్తే మాత్రం వారం, వర్జ్యం చూసుకోరు. దారి వెంబడి ముళ్లు ఉంటాయని భయపడరు. వారి వద్దకు కష్టమైనా చేరుకుంటారు. వారి కష్టాలను తుడిచే ప్రయత్నం చేస్తారు.
ప్రజల కోసం.. వారి బాగు కోసం ఏదైనా నిస్వార్థంగా చేస్తే అది ఖచ్చితంగా ఫలితం ఇస్తుందని జనసేనాని పవన్ కళ్యాణ్ చూస్తే తెలుస్తోంది. ఒక ప్రభుత్వం చేయాల్సిన పనిని.. తను సినిమాల్లో కష్టపడి సంపాదించిన సొమ్మును చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఇస్తున్న తీరు చూసి అందరూ అభినందిస్తున్నారు. ఈరోజుల్లో ఇలా 5 కోట్లు, 10 కోట్లు రైతులకు సొంత డబ్బులు ఇచ్చేవారు ఎవరుంటారని అందరూ ప్రశంసిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టిన ఒకేఒక నాయకుడు పవన్. ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున సాయం అందించారు. వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. కౌలురైతుల కష్టాలను బయట ప్రపంచానికి చాటిచెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్.
పవన్ తో ప్రారంభమైన జనసేన ప్రస్థానం.. 6.76 లక్షల సభ్యత్వానికి చేరుకుంది. ఇన్ని లక్షల మందికి ఏదో ఒకటి చేయాలని పవన్ సంకల్పించారు. బీమా పథకాన్ని ప్రారంభించారు. జనసేన సభ్యత్వం ఉన్నవారికి వర్తింపజేశారు. బీమా మొత్తాన్ని కూడా తానే భరించారు. ఇప్పటికే వివిధ కారణాలతో మృతిచెందిన వారికి లక్షలాది రూపాయల ప్రమాద బీమా పరిహారాన్ని అందించి ఆదుకున్న ఘనత పవన్ కళ్యాణ్ ది. అందుకే జన సైనికులు ఆయన మాటకు, మాట తీరుకు ముగ్ధులవుతారు. ఒక ఉన్నత స్థానంలో ఉండాలని కలలు కంటారు.
ఇప్పటం ఎపిసోడ్ నే తీసుకుందా. జనసేన ఆవిర్భావ సభ నిర్వహణకు స్థలాలిచ్చారని గ్రామంపైనే కక్ష కట్టింది వైసీపీ సర్కారు. వారి ఇళ్లు కూల్చివేసింది. సంక్షేమ పథకాలను నిలిపివేసింది. పౌరసేవలు సైతం నిలిపివేస్తామని బెదిరించింది. ఆ సమయంలో పవన్ స్పందించిన తీరు సగటు అభిమానిని ఆకట్టుకుంది. అతడిపై అభిమానాన్ని రెట్టింపు చేసింది. నాడు అడ్డుకున్న పోలీసులపై పవన్ స్పందించిన తీరు ఇప్పటికీ అభిమానుల చెవుల్లో గివ్వుమంటోంది. ‘కొట్టుకుంటే కొట్టుకోండి.. తిట్టుకుంటే తిట్టండి.. అడ్డుకుంటే అడ్డుకోండి.. కావాలంటే అరెస్టులు చేసుకున్నా సిద్ధం. ఎన్ కౌంటర్ చేస్తానన్నా భయపడేవాణ్ణి కాదు.. అరెస్టులకు భయపడతానా.. జన సైనికులకు ఒక్కటే విన్నవిస్తున్నా.. పోలీసు అధికారుల మీదకు ఎవరూ ఎగబడ వద్దు.. వారితో కలబడ వద్దు. అరెస్టులు చేసుకున్నా.. అడ్డుకున్నా.. కేసులు పెట్టుకున్నా మనం మాత్రం ముందుకే వెళ్దాం రండి…’- ఇప్పటం గ్రామానికి బయలుదేరిన తీరు ఇప్పటికీ గుర్తుకు వస్తోంది.
ఇప్పుడు శ్రీకాళహస్తి ఎపిసోడ్ నే తీసుకుందాం. మహిళా సీఐ అంజూ యాదవ్ చేతిలో ఓ జనసేన నాయకుడు దెబ్బలు తిన్నాడు. బాధితుడిగా మారాడు. కానీ ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్నది మహిళా అధికారిణి కావడంతో పవన్ ఆలోచించారు. కానీ ఆమెపై ఇటువంటి వివాదాలు ఎన్నో ఉన్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆమె బాధితులుగా ఉన్నారు. అందుకే పవన్ రెస్పాండ్ అయ్యారు. అలాగని నేరుగా శ్రీకాళహస్తి వెళ్లకుండా తిరుపతి వెళ్లి ఎస్పీకి ఫిర్యాదుచేశారు. తనను నమ్ముకున్న ప్రజలకు, తన ద్వారా న్యాయం జరుగుతుందనుకున్న వారికి అండగా నిలవడంతో పవన్ ఎప్పుడూ ముందుంటారు. అందుకే ఆయన ప్రజా నాయకుడయ్యారు. ప్రజా సమస్యల పరిష్కార వారధిగా నిలిచారు.