TDP Janasena Alliance: టిడిపి, జనసేన పొత్తుల వ్యవహారం అంత ఈజీగా తేలే అవకాశం కనిపించడం లేదు. అది అనుకున్నంత సులువు కాదని తెలుస్తోంది. చంద్రబాబు పొత్తు ధర్మం పాటించలేదని పవన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పెను దుమారమే రేగుతోంది. రా కదలిరా సభల్లో చంద్రబాబు మండపేట, అరకు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. దీనిపై జనసేన నేతలు అభ్యంతరాలు, ఫిర్యాదులతో పవన్ స్పందించారు. చంద్రబాబు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు రెండు సీట్లకు అభ్యర్థులు ప్రకటించడానికి తప్పుపడుతూ.. తాను సైతం రాజానగరం, రాజోలు సీట్లకు జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు. పొత్తు కొనసాగుతుందని చెబుతూనే.. పొత్తు ధర్మం పాటించకపోతే తాను కూడా పునరాలోచన చేస్తానని స్పష్టమైన సంకేతాలు పంపారు.
పవన్ ప్రకటనతో తెలుగుదేశం పార్టీ అలెర్ట్ అయ్యింది. పవన్ సీట్లను ప్రకటించడాన్ని సమర్థించింది. ఆ రెండు సీట్లు జనసేనవేనని తేలిగ్గా తీసుకుంది. అయితే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం హై కమాండ్ ప్రకటనను తప్పుపడుతున్నారు. ఏకంగా రాష్ట్ర కార్యాలయానికి వచ్చి నిలదీసినంత పని చేశారు. దీంతో హై కమాండ్ పెద్దలు వారిని సముదాయించాల్సి వచ్చింది. రాజోలు నుంచి సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు, రాజానగరం నుంచి బొడ్డు వెంకటరమణ చౌదరి సీట్లు ఆశిస్తున్నారు. ఆ ఇద్దరు నేతలు పార్టీ శ్రేణులతో కలిసి వచ్చి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడును కలిశారు. ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే దీనిపై అచ్చెనాయుడు వారిని సముదాయించారు. చంద్రబాబు అన్ని విషయాలు మాట్లాడుతారని చెప్పుకొచ్చారు. ఎవరూ ఆందోళన చెందవద్దని బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ గొల్లపల్లి సూర్యారావు అనుచరులు మాత్రం తమ నేతకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.
అయితే ఈ రెండు నియోజకవర్గాల విషయంలోనే కాదు.. గోదావరి జిల్లాల్లో జనసేనకు సీట్లు కేటాయిస్తారని ప్రచారం జరుగుతున్న అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలానే ఉంది. ఎక్కడికక్కడే టిడిపి ఇన్చార్జిలు పార్టీ శ్రేణులతో సమావేశం అవుతున్నారు. పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం కేటాయించవద్దని స్పష్టం చేస్తున్నారు. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ టిడిపి టికెట్ ను ఆశిస్తున్నారు. ఈ సీటును జనసేన ఆశిస్తోంది. దీంతో వర్మ అప్రమత్తమయ్యారు. పార్టీ శ్రేణులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. వర్మకు మద్దతుగా సమావేశానికి అయ్యన్నపాత్రుడు హాజరయ్యారు. వర్మకు ఎట్టి పరిస్థితుల్లో సీటు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో ఎన్నికల ముంగిట పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు పెద్ద జఠిలంగా మారే అవకాశం కనిపిస్తోంది. రగడ తప్పదని.. మధ్యలో వైసిపి కలుగజేసుకొని దుష్ప్రచారం చేస్తుండడంతో రెండు పార్టీల మధ్య అగాధం ఏర్పడుతోంది. మరోవైపు మెగా బ్రదర్ నాగబాబు విభిన్నంగా స్పందిస్తున్నారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందని ట్విట్ చేశారు. సరిగ్గా పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పిన తరువాత.. నాగబాబు ఈ ట్విట్ చేయడం విశేషం. మొత్తానికైతే టిడిపిలో పెను వివాదానికి పవన్ కారణమవుతున్నారు. దీనిని చంద్రబాబు ఎలా అధిగమిస్తారో చూడాలి.