Sarpanch Sanyukta : రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయితీల్లో ఈరోజు గ్రామసభలు జరిగాయి. 13 వేలకు పైగా పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు అవసరమైన పనులను గుర్తించారు. ఇలా గ్రామసభల్లో పనులు గుర్తించడం దేశంలో ఇదే తొలిసారి. ఒకే రోజు రికార్డ్ స్థాయిలో గ్రామసభలు నిర్వహించడం గమనార్హం. ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం గ్రామసభల్లో పాల్గొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గ్రామీణ అభివృద్ధి శాఖతో పాటు పంచాయితీరాజ్ శాఖ బాధ్యతలు చూస్తున్న సంగతి తెలిసిందే.ఆది నుంచి పల్లెల విషయంలో ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతున్నారు పవన్. గత ప్రభుత్వం పంచాయితీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో.. బలోపేతం చేసే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు గ్రామసభలకు శ్రీకారం చుట్టారు. అన్నమయ్య జిల్లా మైసూరు వారి పల్లెలో జరిగిన గ్రామసభలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్ కారుమంచి సంయుక్తను అభినందించారు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతకీ ఆమె ఎవరు? ఏ పార్టీ నుంచి సర్పంచ్ గా ఎన్నికయ్యారు? పవన్ ఎందుకు ప్రత్యేకంగా అభినందించారు? అన్నది అందరిలోనూ ఒక రకమైన ఆసక్తి.
* సర్పంచ్ గా పోటీ
2021 మార్చిలో ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు వైసిపి అధికారంలో ఉంది. బలవంతంగా ఏకగ్రీవాలు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలు జరిగిన చోట హింసాత్మక ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. చాలాచోట్ల ప్రత్యర్థులు పోటీకి దిగని పరిస్థితి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైసీపీకి సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మైసూర్ వారి పల్లె పంచాయితీ సర్పంచ్ గా కారుమంచి సంయుక్త పోటీ చేశారు. ఎన్నో రకాల ఒత్తిళ్లు ఎదురైనా ఆమె వెనక్కి తగ్గలేదు. బరిలో దిగి విజయం సాధించారు.
* జనసేన అంటే అభిమానం
సంయుక్త కు జనసేన అంటే విపరీతమైన ఇష్టం. పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం. అందుకే ఆమె సర్పంచ్ ఎన్నికల్లో బరిలో దిగారు. ప్రత్యర్ధులు భయపెట్టినా మనోధైర్యంతో ముందుకు సాగారు. ప్రజల మద్దతుతో సర్పంచ్ గా ఎన్నికయ్యారు. అందుకే ఆమె ధైర్యాన్ని అభినందించారు పవన్. అప్పట్లో ఎన్నికల సమయంలో రోడ్డుమీదకు రావాలంటే భయపడే పరిస్థితి ఉండేదని.. అలాంటి పరిస్థితుల్లోనూ నిలబడి సంయుక్త విజయం సాధించారని పవన్ గుర్తు చేశారు.
* భర్త చనిపోయినా
అయితే సంయుక్త భర్త సైన్యంలో ఉంటూ చనిపోయారు. ఆయన గ్రామాభివృద్ధికి పాటుపడాలని చాలా ఆకాంక్షించేవారు. ఇంతలోనే అనుకోని ప్రమాదంలో ఆయన చనిపోయారు. ఆయన ఆశయ సాధన కోసం రంగంలోకి దిగారు సంయుక్త. జోరు మీదున్న అధికార పార్టీ వైసిపికి కాదని.. జనసేన తరఫున బరిలో దిగారు. భర్త లేకుండా, ప్రజల సహకారంతో సర్పంచ్ గా పోటీ చేసి నెగ్గారు. ఆ విషయం తెలియగానే నిజంగా తన గుండెను కదిలించిందని గుర్తు చేసుకున్నారు పవన్. ఇటువంటి మహిళలు రాజకీయాల్లో ఉండాలని.. రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు.