Patapatnam Janasena: ఉత్తరాంధ్ర పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది జనసేన( janasena ). ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా పై ఫోకస్ చేసింది. ఉత్తరాంధ్రలో విశాఖ, విజయనగరం జిల్లాల్లో జనసేనకు ప్రాతినిధ్యం ఉంది. విశాఖలో నాలుగు అసెంబ్లీ సీట్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. విజయనగరం జిల్లాకు వచ్చేసరికి నెల్లిమర్లలో ప్రాతినిధ్యం ఉంది. పార్వతీపురం మన్యం జిల్లాకు వచ్చేసరికి పాలకొండలో ఆ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. కానీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేదు. అందుకే 2029 ఎన్నికలను టార్గెట్ చేసుకొని ముందడుగు వేస్తోంది జనసేన. శ్రీకాకుళం జిల్లాలో తమ సేఫ్ జోన్ ను ఎంపిక చేసుకునే పనిలో పడింది. అందులో భాగంగా పాతపట్నం నియోజకవర్గం పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ టిడిపి ఎమ్మెల్యే ఉన్నారు. కానీ అనుకున్న స్థాయిలో పనిచేయలేకపోతున్నారన్న విమర్శ ఉంది. ఆపై ఇక్కడ తెలుగుదేశం పార్టీలో విభేదాలు ఉన్నాయి. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నట్టు పరిస్థితి ఉంది. 2024 ఎన్నికల్లో అనూహ్యంగా కలమటను కాదని మామిడి గోవిందరావుకు టికెట్ లభించింది. కూటమి ప్రభంజనంలో మామిడి గోవిందరావు గెలిచారు. అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పాతపట్నం నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తారని ప్రచారం నడుస్తోంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొరికాన రవికుమార్, ఆయన భార్య భవాని ప్రజల్లోకి విస్తృతంగా వెళుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు టీడీపీలో నెలకొన్న పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు.
* జనసేనకు ఎనలేని ప్రాధాన్యం..
కూటమి ప్రభుత్వంలో పాతపట్నం ( pathapatnam) నియోజకవర్గానికి సంబంధించి జనసేనకు ఎనలేని ప్రాధాన్యం లభిస్తోంది. 2024 ఎన్నికల్లో పాతపట్నం నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తారని ప్రచారం నడిచింది. ఆ పార్టీ మహిళా నేత కొరికన భవాని గట్టిగానే ప్రయత్నం చేశారు. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా టిడిపికి ఆ సీటు కేటాయించాల్సి వచ్చింది. కూటమి వేవ్ లో మామిడి గోవిందరావు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ టిడిపి శ్రేణులను కలుపు కెల్లడంలో ఆయన విఫలం అయ్యారు. ఈ నియోజకవర్గానికి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా సేవలందించారు కలమట మోహన్ రావు. అటు తరువాత ఆయన వారసుడిగా తెరపైకి వచ్చారు కలమట వెంకటరమణమూర్తి. 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. కొద్ది రోజులకే తెలుగుదేశం లోకి ఫిరాయించారు. 2019లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2024లో ఆయనను పక్కనపెట్టి మామిడి గోవిందరావుకు టికెట్ ఇచ్చింది టిడిపి హై కమాండ్. కానీ గోవిందరావు గెలిచిన తర్వాత టిడిపిలో గ్రూపుల గోల అధికమైంది. దీంతో మెజారిటీ టిడిపి శ్రేణులు పూర్తి అసంతృప్తితో ఉన్నాయి. వారంతా త్వరలో కొరికాన భవాని, రవికుమార్ నేతృత్వంలో జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
* వైసిపి అసంతృప్తులు..
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీలో అసంతృప్తులు బయటకు వచ్చి జనసేనలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఉన్నారు. 2014 ఎన్నికల నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆమెకు అవకాశం ఇస్తూ వస్తోంది. 2014లో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు రెడ్డి శాంతి. అయితే ఆ ఎన్నికల్లో ఓడిపోవడం, పాతపట్నం నుంచి గెలిచిన కలమట వెంకటరమణమూర్తి వైసీపీ నుంచి ఫిరాయించడం వంటి కారణాలతో రెడ్డి శాంతి అక్కడకు వచ్చారు. 2019లో జగన్ ప్రభంజనంలో గెలిచారు. 2024 ఎన్నికల్లో మాత్రం దారుణ పరాజయం చవిచూశారు. ఎన్నికలకు ముందు ఆమె అభ్యర్థిత్వాన్ని మార్చాలని వైసీపీ శ్రేణులు కోరాయి. కానీ హై కమాండ్ వినలేదు. ఇప్పుడు ఆమె నియోజకవర్గానికి అందుబాటులో లేకపోవడంతో చాలామంది వైసిపి నేతలు జనసేనలోకి వచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వైసిపి ముఖ్య నేతలు అంతా జనసేన మహిళా నేత కొరికాన భవానిని కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో జనసేన గూటికి చేరుతారని తెలుస్తోంది.
* దూసుకుపోతున్న దంపతులు..
జనసేన నేతలు కొరికాన భవాని( korikana Bhavani ), రవికుమార్ లు బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలు. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వీరు రోజురోజుకు పట్టు పెంచుకుంటున్నారు. సేవా కార్యక్రమాలు సైతం విస్తృతం చేస్తున్నారు. నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల శిక్షణ సొంత ఖర్చులతో ఇస్తున్నారు. నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. అందుకే జనసేన నాయకత్వం గుర్తించి తూర్పు కాపు కార్పొరేషన్ పదవి రవికుమార్ కు ఇచ్చింది. ఆపై హిరమండలం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించడం ద్వారా.. 2029 ఎన్నికల్లో పాతపట్నం టికెట్ జనసేనకు కేటాయిస్తామని స్పష్టమైన సంకేతాలు పంపగలిగింది. ఒకవైపు రెండు ప్రధాన పార్టీల నుంచి క్యాడర్ జనసేనలో చేరేందుకు సిద్ధపడుతుండడం.. కొరికాన రవికుమార్, భవాని దంపతులు దూకుడు పెంచుతుండడంతో భవిష్యత్ పాతపట్నం జనసేన దేనిని విశ్లేషణలు వెలువడుతున్నాయి.