Pandem Kodi Price: సంక్రాంతి( Pongal) అంటేనే ఒక రకమైన సందడి. కొత్త అల్లుళ్లు వస్తారు. పిల్లలతో సందడి సందడిగా ఉంటుంది ఇల్లు. పండగలో ఆహారం ప్రత్యేకం. ముఖ్యంగా మాంసాహారం. అందులోనూ నాటుకోడికి ఎక్కువమంది ప్రాధాన్యమిస్తారు. అయితే పండుగ పుణ్యమా అని ఇప్పుడు నాటు కోళ్లకు విపరీతమైన గిరాకీ. నాటు కోళ్లు తగ్గుతున్న తరుణంలో.. ఉన్నవాటిని దక్కించుకునేందుకు పోటీ పడుతుంటారు. దీంతో వాటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. చాలా ప్రాంతాల్లో కేజీ నాటు కోడి ధర రెండు వేల రూపాయలు పలుకుతోంది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సంక్రాంతికి విదేశాలు, ఇతర దూర ప్రాంతాల నుంచి సొంత గ్రామాలకు వచ్చే బంధువులు ఊర్లోని కుటుంబ సభ్యులు ముందుగానే మెనూ కోరుతున్నారు. వారు నాటుకోడి అని చెబుతుండడంతో ముందుగానే వాటికి బయానా ఇస్తున్నారు.
* అమాంతం పెరిగిన ధర..
సాధారణంగా నాటు కోళ్ల ధర రూ.800 నుంచి 1200 రూపాయలు వరకు ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక్కసారిగా కోళ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. దీనికి ప్రధాన కారణం ఉత్పత్తి తగ్గడమే. కొన్నాళ్ల క్రితం వైరల్ కారణంగా చాలా ప్రాంతాల్లో నాటు కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో తీవ్రంగా నష్టపోయిన వ్యాపారులు కోళ్ల పెంపకాన్ని తగ్గించారు. అటు పల్లెల్లో కూడా జనాలు కోళ్ల పెంపకం పై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో నాటు కోళ్ల సప్లై భారీగా తగ్గిపోయింది. ఎక్కడ కోళ్లు దొరకని పరిస్థితి. ఉన్న తక్కువ కోళ్ళకు పోటీ ఏర్పడడంతో అధిక ధరకు వసూలు చేస్తున్నారు.
* రూ.3.50 లక్షలకు ఆఫర్..
మరోవైపు గోదావరి జిల్లాలో కోడిపందాలకు సంబంధించిన ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. నిర్వాహకులు పందెం బరులను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు పందాలకు కోడిపుంజులు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇలా బరిలో దిగే పందెం కోళ్ల ధరలు కూడా భారీగా ఉన్నాయి. కాకినాడ జిల్లాలో ఓ కోడిపుంజుకు భారీ ధర ఇస్తామని ఆఫర్ ఇచ్చారట. పెద్దాపురం మండలంలోని ఓ కోళ్ల ఫారం లో ఓ పందెం పుంజును పెంచుతున్నారు. కొక్కిరా ఈ రకానికి చెందిన ఈ పుంజు బరువు ఏకంగా ఐదు కిలోలు ఉంది దీని వయస్సు మూడు సంవత్సరాల నాలుగు నెలలు. అయితే ఈ పుంజు కోసం మూడు లక్షల 50 వేల రూపాయలు ఆఫర్ చేసినట్లు యజమాని చెబుతున్నారు. ఈ పుంజు పందెం కోళ్లలో మేలైన జాతి. అందుకే అంత డిమాండ్. ఈ కోడిని సంతానోత్పత్తికి కూడా వినియోగిస్తారు.