Uttarandhra Slang: ఉత్తరాంధ్ర.. ఇక్కడి భాష, యాస చాలా ప్రత్యేకం. తెలుగు రాష్ట్రాల్లో భిన్నంగా ఉంటుంది ఇక్కడి యాస. మరి ముఖ్యం శ్రీకాకుళం. అయితే ఒకప్పుడు ఇక్కడి మాండలికాన్ని ఎగతాళిగా చూసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఇదే యాసతో తెలుగు చిత్రాలు, ముఖ్యమైన హీరోల సినిమాలు వస్తుండడం గమనార్హం. తాజాగా రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ ట్రైలర్ వచ్చింది. అందులో ఉత్తరాంధ్రాయాసతోనే పాత్రధారులంతా కనిపించారు. క్రీడల నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం పూర్తిగా ఉత్తరాంధ్ర యాసలోనే కొనసాగుతుందని సినిమా ట్రైలర్ చెబుతోంది. మొన్నటివరకు రాయలసీమ యాస నడిచింది తెలుగు చిత్ర పరిశ్రమలు. అటు తరువాత తెలంగాణ యాస నడిచింది. కమెడియన్లతోపాటు విలన్లకు మాత్రమే తెలంగాణ యాసతో మాట్లాడించేవారు. తరువాత కాలంలో ప్రముఖ హీరోలతో సైతం తెలంగాణ యాసతో మాట్లాడించి సినిమాలను విజయవంతంగా తీర్చిదిద్దారు. అయితే ఇప్పుడు ఉత్తరాంధ్ర మాండలికంపై, యాసతో సినిమాలు రూపొందిస్తుండడం విశేషం.
* ఇక్కడి యాస ప్రత్యేకం
ఉత్తరాంధ్రలో పుట్టి ప్రముఖులుగా ఎదిగిన వారు సైతం.. తమ స్వస్థలాలకు వస్తే తమ యాసతోనే మాట్లాడతారు. శ్రీకాకుళం యాసను చూసి చాలా తక్కువగా అంచనా వేసేవారు. కానీ చాలా రంగాల్లో ఉత్తరాంధ్రవాసులు సాధించిన విజయాలను చూసినవారు మాత్రం ఇక్కడి యాసను గౌరవిస్తుంటారు. ఇక్కడి గ్రామీణ నేపథ్యాన్ని అభిమానిస్తుంటారు. మాయా మర్మం తెలియని మనస్తత్వాలను చూసి ఆశ్చర్య పడుతుంటారు. వేరువేరు ప్రాంతాల్లో కనిపించే ఉత్తరాంధ్ర ప్రజలు మాట్లాడే తీరు ప్రత్యేకం. భాషతో, యాసతో మనుషులను తక్కువ చేసే రోజులు పోయాయి. అది ఉత్తరాంధ్ర ప్రజల ద్వారానే ఎక్కువగా అర్థమయింది. ఉత్తరాంధ్ర ప్రజలు అంటే వెనుకబాటు అనే ముద్రతో చూసేవారు. కానీ ఇప్పుడు ఏకంగా ఉత్తరాంధ్ర యాసతో సినిమాలు వస్తుండడం విశేషం.
* తండేల్ తో మరింత..
ఉత్తరాంధ్ర మత్స్యకారుల కష్టాలను ఇతివృత్తంగా చేసుకుని మొన్న ఆ మధ్యన వచ్చిన తండేల్ చిత్రం ఎంతగానో ఆకట్టుకుంది. ఉత్తరాంధ్రకు చెందిన ఓ జాలారి యువకుడిగా నాగచైతన్య ఒదిగిపోయారు. మత్స్యకార యువతిగా సాయి పల్లవి ఎంతగానో ఆకట్టుకున్నారు. పాకిస్తాన్ చెరలో చిక్కుకున్న ఉత్తరాంధ్ర మత్స్యకారుల బాధలను ఇతివృత్తంగా చేసుకుని చందు మొండేటి.. పూర్తిగా ఉత్తరాంధ్ర యాసలోనే దీనిని తీర్చిదిద్దారు.
* ‘పలాస’తో సిక్కోలు యాస..
అంతకుముందు పలాస అనే చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు కద్దాల కిరణ్ కుమార్. స్వతహాగా ఆయనది శ్రీకాకుళం జిల్లాలోని పలాస ప్రాంతం. విద్యార్థి దశలో జరిగిన పరిణామాలను ఇతివృత్తంగా చేసుకొని.. అక్కడి యాసత్తు రూపొందించిన ఈ చిత్రం విమర్శకులను సైతం మెప్పించింది. స్థానిక నటులతో కలిసి అక్కడి భాషా తోనే ఈ చిత్రాన్ని తీయడం.. ఆయనలో ఉన్న ప్రతిభను బయటపెట్టింది. ఇప్పుడు అదే అనుభవంతో వరుణ్ తేజ్ తో మట్కా అనే సినిమా రూపొందిస్తున్నారు కద్దాల కరుణ్ కుమార్. ఇంకోవైపు అనుష్క ప్రధాన పాత్రలో.. లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నారు దర్శకుడు క్రిష్. అదికూడా ఉత్తరాంధ్ర మాండలికంతో ఉండనుంది. ఇక్కడి యాసను ప్రతిబింబించనుంది. మొత్తానికి అయితే రాయలసీమతో ప్రారంభమైన చిత్ర పరిశ్రమ యాస.. ఉత్తరాంధ్రవైపు మళ్లడం శుభపరిణామం.
