Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు. ఎన్నికల్లో అనూహ్యంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిచారు. పిఠాపురం ప్రజల మనసును గెలుచుకున్నారు. అందుకే ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని.. స్థానికేతర నేత అన్న ముద్రను లేకుండా చూసుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఇంటి నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని కొనుగోలు చేశారు పవన్. ఇప్పుడు ఏకంగా 12 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ భూమి రిజిస్ట్రేషన్ ను పవన్ తరుపున రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ పూర్తి చేశారు. తోట సుధీర్ కొనుగోలు పత్రాలపై సంతకాలు చేసినట్లు సమాచారం. పిఠాపురంలో ఇదివరకే కొనుగోలు చేసిన స్థలం చెంతనే ఈ భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలోని12 ఎకరాల భూమిని పవన్ కొనుగోలు చేశారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ సోమవారం పిఠాపురం పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం వైసీపీ నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఎక్కడో హైదరాబాదులో ఉండే పవన్ కళ్యాణ్ ను కలవాలంటే ఇబ్బందులు ఎదురవుతాయని.. అందుకే స్థానిక నేత వంగా గీతను ఎన్నుకోవాలని వైసిపి నేతలు ప్రచారం చేశారు. అయినా సరే పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ను గెలిపించారు.
* జూలైలోనే స్థలం కొనుగోలు
వాస్తవానికి పవన్ కళ్యాణ్ జూలైలోనే పిఠాపురంలో భూమిని కొనుగోలు చేశారు. ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, భోగాపురం రెవెన్యూ పరిధిలో 2.08 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇప్పుడు తాజాగా మరోసారి 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. త్వరలో ఈ స్థలంలో ఇల్లు, క్యాంపు కార్యాలయం నిర్మించనున్నట్లు తెలుస్తోంది.పిఠాపురం విషయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టితో ఉన్నారు. చంద్రబాబుకు కుప్పం, జగన్ కు పులివెందుల మాదిరిగానే..పిఠాపురం నియోజకవర్గాన్ని పక్కాగా చేసుకోవాలని భావిస్తున్నారు.
* ధర ఎంతో తెలుసా?
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన ప్రాంతంలో ఎకరా భూమి ధర మార్కెట్ విలువ 16 లక్షలు వరకు పలుకుతోంది. తాజాగా ఆయన మరో 12 ఎకరాలు కొనుగోలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ భూమి విలువ ఎకరా 20 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంటే ఈ 12 ఎకరాల ధర రెండు కోట్ల 40 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. అయితే పవన్ భూమి కొనుగోలు నేపథ్యంలో.. ఇతర జనసేన నేతలు సైతం అక్కడ భూముల పై పెట్టుబడి పెట్టేందుకు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. దీంతో పిఠాపురంలో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ముఖ్యంగా సినీ ప్రముఖులు సైతం ఇక్కడ భూములు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.