Pawan – Chandrababu : వారాహి యాత్రలో పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు? సెడన్ గా జనసేనాని అలా మాట్లాడేసరికి మైండ్ బ్లాక్ అయ్యిందా? బాబు అయోమయానికి గురయ్యారా? లేకుంటే చంద్రబాబు వ్యూహంలో భాగంగానే పవన్ అలా మాట్లాడుతున్నారా? అని ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఒక చర్చ అయితే నడుస్తోంది. దీని చుట్టూ విశ్లేషణలు వెలువడుతున్నాయి. గత రెండేళ్లుగా టీడీపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల దోబూచులాట చర్చకు వస్తోంది. కానీ ఇప్పటివరకూ దీనిపై క్లారిటీ లేదు. కానీ ప్రజలకు మాత్రం రెండు పార్టీలు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నాయి.
అప్పుడెప్పుడో చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. ఆ సమయంలో సభలు, రోడ్ షోలో టీడీపీ శ్రేణులు కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. తారక్ నాయకత్వానికి ప్రోత్సాహం అందించాలని కోరారు. దీనిపై బాబు పెద్దగా స్పందించలేదు. అదంతా వైసీపీ సృష్టించినదిగా అనుమానం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులకు పట్టించుకోవద్దని సూచించారు. అయితే అదే సభలో ఒకేఒక కార్యకర్త పవన్ గురించి గట్టిగా కేకలు వేశారు. పవన్ ను కలుపుకొని పోవాలని చంద్రబాబుకు సూచించారు. దీనిపై బాబు వెనువెంటనే స్పందించారు. లవ్ వన్ సైడ్ ఉంటే కుదరదు తమ్ముడు.. రెండువైపులా ఉండాలని అన్నారు. దీంతో అక్కడ నుంచి పొత్తుల అంశానికి బీజం పడింది.
చంద్రబాబు అలా అనేసరికి ఇప్పటంలోని జనసేన ఆవిర్భావ సభలో పవన్ స్పందించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని స్పష్టం చేయడం ద్వారా పొత్తులు పెట్టుకుంటామని సంకేతాలిచ్చారు. వైసీపీ నేతలపై విమర్శలు చేసే క్రమంలో మేము ఎవరితో పొత్తులు పెట్టుకుంటే మీకేందుకు అంటూ ప్రశ్నించారు. అప్పటి నుంచి ఇరు పార్టీల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడింది. చాలాసార్లు చంద్రబాబు, పవన్ లు కలుసుకున్నారు. ఏకంతా చర్చలు జరిపిన సందర్భాలున్నాయి. కానీ నేరుగా సీట్ల సర్దుబాటు, కలిసి పోటీచేసే విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
తనకు పదవులతో పనిలేదని చెప్పడంతో ఇన్నాళ్లూ చంద్రబాబు అండ్ కో రిలాక్స్డ్ గా ఉంది. కానీ పవన్ జనసేనను మాత్రమే గెలిపించాలని.. జనసేనకు ఒక చాన్సివ్వాలని.. సీఎంగా తనకు అవకాశం ఇవ్వాలని స్వరం మార్చడంతో టీడీపీ శ్రేణుల్లో వణుకు ప్రారంభమైంది. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ వారాహి యాత్ర నడుస్తోంది. చంద్రబాబు సైతం కుప్పంలో పర్యటిస్తున్నారు. కనీసం పవన్ అలా ఎందుకు మాట్లాడుతున్నారో చంద్రబాబు ప్రస్తావించడం లేదు. గతంలో పవన్ విషయంలో చంద్రబాబు క్లారిటీగా ఉండేవారు. ఈసారి మాత్రం మౌనమే బెస్ట్ అన్నట్టుగా ఉన్నారు. అయితే అది వ్యూహాత్మకమా? అన్నది కొద్దిరోజుల్లో తేలిపోనుంది.