Anil Kumar Yadav missing: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది నేతలు ఒక వెలుగు వెలిగారు. మంత్రి పదవులు దక్కించుకున్నారు. ఆర్థికంగా బలోపేతమైన వారు ఉన్నారు. అయితే పార్టీ కష్టకాలంలో ఉండగా చాలామంది నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.. మరికొందరు ఫుల్ సైలెంట్ అయ్యారు. ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్న వారు ఉన్నారు. కొడాలి నాని లాంటివారు ఇటీవల ముందుకు వచ్చారు. కూటమి ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. కానీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జాడ మాత్రం ఇంతవరకు లేదు. అందరూ నేతలు కనిపిస్తున్నా అనిల్ కుమార్ యాదవ్ ఎందుకో కనిపించడం లేదు. మొన్న కోఆర్డినేటర్ల సమావేశానికి సైతం హాజరు కాలేదు. అప్పుడప్పుడు నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టి కనిపించే ఆయన ఇప్పుడు బొత్తిగా జాడ లేకుండా పోయారు. అసలు ఆయన యాక్టివ్ అవుతారా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. లేకుంటే క్రమేపి పార్టీకి, రాజకీయాలకు దూరం అవుతారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.
తీవ్ర నైరాస్యంలో..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నైరాస్యంలో పడిపోయాయి. దీనికి తోడు పార్టీ నుంచి నేతలు బయటకు వెళ్లిపోయారు. ఉన్నవారు సైతం ఫుల్ సైలెంట్ అయ్యారు. దీంతో అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీని యాక్టివ్ చేసేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే అధికారానికి దూరమై రెండేళ్లు అవుతున్న తరుణంలో కూటమి ప్రభుత్వంపై గట్టి ఆందోళనలకు పిలుపునిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈనెల 4 నుంచి 12 వరకు వరుసగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇటీవల తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ శ్రేణులు హాజరయ్యాయి. దాదాపు మాజీ మంత్రులతో పాటు నియోజకవర్గ ఇన్చార్జిలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జాడ మాత్రం లేదు.
వారందరూ యాక్టివ్ అయినా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు అనిల్ కుమార్ యాదవ్. ఆయన ఒక్కడు మాత్రమే కాదు. పేర్ని నాని, కొడాలి నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్ లాంటివారు అప్పట్లో గట్టిగానే మాట్లాడేవారు. వారిపై బూతు అనే ముద్ర కూడా ఉంది. అయితే వైసిపి అధికారానికి దూరమైన తర్వాత చాలామంది నేతలు బయటకు వెళ్లిపోయారు. అయితే వైసీపీలో ఫైర్ బ్రాండ్ ముద్ర వేసుకున్న వారికి మాత్రం కూటమి పార్టీల్లో ఆప్షన్ లేదు. వేరే పార్టీల్లో అవకాసం లేదు. అందుకే అలానే ఉండిపోయారు. అయితే కొడాలి నాని లాంటి వారు కూడా అనారోగ్యానికి గురై తిరిగి యాక్టివ్ అవుతూ కనిపిస్తున్నారు. కానీ అనిల్ కుమార్ యాదవ్ మాత్రం అలా కాదు. ఆయన ఎందుకో మన రాష్ట్రంలో కూడా కనిపించడం లేదు. పక్క రాష్ట్రంలో వ్యాపారాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఆయన నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు. ఓటమి చవిచూశారు. కానీ ఆయన తిరిగి నెల్లూరు సిటీ నియోజకవర్గ బాధ్యతలను కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడంతోనే పక్క రాష్ట్రంలో వ్యాపారాలకు పరిమితం అవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
