Deputy CM Pavan : పవన్ కళ్యాణ్ మొండిఘటం. ఈ విషయం అందరికీ స్పష్టం. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన చర్యలు ఎవరికైనా ఆశ్చర్యం కలిగించక మానవు. అసలు అదొక పార్టీయేనా? అన్నవారికి సరైన సమాధానం చెప్పారు పవన్. అయితే ఇది ఒక గంట, ఒకరోజు, ఒక నెల, ఒక ఏడాదిలో రాలేదు. సుదీర్ఘకాలం నిరీక్షించారు. ప్రజా సమస్యలపై పోరాడారు. వాటి పరిష్కారానికి కృషి చేశారు. చివరిగా ప్రజల మన్ననలు అందుకున్నారు. అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. జగన్ ను అధికారం నుంచి దూరం చేయగలిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. పార్టీ పెట్టిన పది సంవత్సరాల్లో ఈ ఘనత సాధించారు. అయితే ఈ పదేళ్లలో ఎన్నో రకాల అవమానాలకు గురయ్యారు. ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యారు. అయినా సరే అనుకున్నది సాధించారు. అయితే పవన్ కళ్యాణ్ లో జాతీయ సమైక్యత భావం ఎక్కువ. స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తి. ఆయన శైలిలో కమ్యూనిజం కనిపిస్తుంది. అయితే అటువంటి వ్యక్తి ఇప్పుడు సనాతన ధర్మపరిరక్షణకు నడుం బిగించడం విశేషం. అందుకే ఇప్పుడు ప్రత్యర్ధులు ఆయనకు ప్రశ్నలు వేస్తున్నారు.
* సనాతన ధర్మ పరిరక్షణ ప్రస్తావన
ప్రస్తుతం టీటీడీ లడ్డు వివాదం కుదిపేస్తోంది. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోంది. ఇటువంటి తరుణంలోనే పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మ పరిరక్షణకు సరైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. అటు ఈ ఘటనపై నిరసిస్తూ ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేపడుతున్నారు. 11 రోజులు పాటు ఈ దీక్షలో కొనసాగున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది హిందువులు పవన్ చర్యలను ఆహ్వానిస్తున్నారు. కానీ ప్రత్యర్థులు మాత్రం రకరకాల ప్రశ్నలతో ముందుకు వస్తున్నారు.
* పొలిటికల్ గా స్టాండ్స్ మార్చుతూ
పదేళ్ల కిందట జనసేన ఆవిర్భవించింది. తొలి ఎన్నికల్లో పోటీ చేయలేదు. కేంద్రంలో బిజెపికి, రాష్ట్రంలో టిడిపికి మద్దతు తెలిపారు పవన్. కానీ ఆ బంధం కొనసాగలేదు. 2019 ఎన్నికల నాటికి బిజెపి స్నేహాన్ని టిడిపి వదులుకుంది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. ఎవరికివారుగా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో పవన్ ఆ రెండింటిలో ఒకదానితో కూడా వెళ్లలేదు. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు. బీఎస్పీతో దోస్తీ చేశారు. కానీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. అక్కడ కొద్ది రోజులకే బిజెపితో స్నేహం చేశారు. ఆ పార్టీతో ముందడుగు వేశారు. ఈ ఎన్నికల్లో బిజెపిని టిడిపి కూటమిలోకి చేర్చి.. జగన్ ను అధికారం నుంచి దూరం చేశారు.
* ప్రత్యర్థులకు టార్గెట్
అయితే ఎప్పటికప్పుడు పవన్ నిర్ణయాలు మార్చుకుంటుండడంఫై ప్రత్యర్థులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. చేగువేరా తో మొదలుపెట్టాడు. తెలంగాణ రైతాంగ పోరాటం చదివాను అన్నాడు. గద్దర్ అంటే ఇష్టం అన్నాడు. గురజాడ, శేషాంద్రలను కోడ్ చేశాడు. ఇప్పుడు సనాతన ధర్మంపై అడుగులు వేస్తున్నాడు. పవన్ ఎవరికి అర్థం కాదు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి. ఆయనకు నిలకడ లేదని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అయితే వీటిని పట్టించుకునే స్థితిలో లేరు పవన్.