Operation Clean Politics in AP : తెలుగుదేశం (Telugudesam)పార్టీ మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు కడపలో నిర్వహించిన మహానాడు టీడీపీ శ్రేణుల్లో స్ఫూర్తిని నింపింది. టీడీపీ భవిష్యత్ కు దిశా నిర్దేశం చేసింది. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే తొలిసారిగా కడప జిల్లాలో మహానాడు నిర్వహించింది. ఈ విషయాన్ని మూడు నెలల కిందటే వెల్లడించింది. అయితే కడపలో ఏంటి? మహానాడు ఏంటి? సక్సెస్ అవుతుందా? లేదా? అని అందరిలోనూ ఒకటే సంశయం. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ మహానాడు రికార్డు క్రియేట్ చేసింది. సరికొత్త హిస్టరీ రిపీట్ చేసింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను ఏరివేసిన ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్,ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ నాంది పలుకుదామని చంద్రబాబు ఇచ్చిన పిలుపు టీడీపీ శ్రేణుల్లోకి బలంగా వెళ్లింది. చంద్రబాబు ముగింపు ఉపన్యాసం విశేషంగా ఆకట్టుకుంది. టెర్రరిస్టులు దేశానికి ఎంత ప్రమాదమో ..ఆర్థిక ఉగ్రవాదులు రాష్ట్రానికి అంత ప్రమాదమని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. వారిని రాష్ట్రం నుంచి తరిమికొడదామని చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు తమ కరతాళ ధ్వనులతో ఆహ్వానించాయి.
కడప టీడీపీలో జోష్..
కడప (Kadapa)మహానాడు రాయలసీమ తెలుగుదేశంలో జోష్ నింపింది. మహానాడు సక్సెస్ వెనుక రాయలసీమ టీడీపీ నేతల సమన్వయం కనిపించింది. ఇదే విషయాన్ని చంద్రబాబు అనేసరికి కడప టీడీపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఒక్కసారి ఉబికివచ్చిన కన్నీరుతో కనిపించారు. దీంతో చంద్రబాబు సముదాయించి హత్తుకున్నారు. అయితే మొత్తం రాయలసీమ టీడీపీ నేతల్లో ఒక రకమైన విజయగర్వం కనిపించింది. కడప జిల్లా వైసీపీ అడ్డా అని ఆ పార్టీ పెట్రేగిపోయింది. అటువంటి చోట మహానాడు రూపంలో గర్జించారు టీడీపీ శ్రేణులు. సామాన్య కార్యకర్త నుంచి టీడీపీ అధినేత వరకూ అదే గెడ్డపైకి వచ్చి గర్జించేందుకు బలంగా నిర్ణయం తీసుకున్నారు. యావత్ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. అంచనాలకు అందని రీతిలో కార్యకర్తలు రావడం, అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయడం, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మహానాడు సక్సెస్ కావడంతో టీడీపీ శ్రేణుల్లో విజయదరహాసం కనిపించింది.
Also Read : చంద్రబాబు కొత్త రికార్డు!
గెలుపు ఊపుతో..
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కడప అంటే ఒక కొరకరాని కొయ్యగా మారింది. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS rajasekharreddy) కుటుంబ హవా జిల్లాలో నడిచేది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. కడపలో మాత్రం ఆ కుటుంబ మాట చెల్లుబాటు అయ్యేది. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కాలం జిల్లాను శాసించింది. అటు తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ ఆ స్థానాన్ని భర్తీ చేసింది. జగన్మోహన్ రెడ్డి మాటే శాసనంగా జిల్లాలో పరిస్థితి ఉండేది. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినా.. కడప జిల్లాలో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. 2019లో అయితే క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఐదేళ్ల వైసీపీ పాలనలో కడపపై ఫుల్ ఫోకస్ పెట్టారు చంద్రబాబు. నేతల భుజం తడుతూ…వారిలో ధైర్యం నింపుతూ వైసీపీ వైఫల్యాలను ఎండగట్టేలా చేశారు. యుద్ధంలో సైనికుల మాదిరిగా టీడీపీ శ్రేణులు సర్వశక్తులూ ఒడ్డాయి. సాధారణ ఎన్నికల్లో 10 స్థానాలకుగాను ఏడుచోట్ల ఘన విజయం సాధించింది కూటమి. అదే ఊపు.. అదే ఉత్సాహంతో మహానాడు నిర్వహించింది. విజయవంతం కావడంతో కడప టీడీపీలో ఒక రకమైన జోష్ అయితే మాత్రం కనిపిస్తోంది.