Cine Industry : ఇటీవల భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు దారుణంగా దెబ్బతిన్నాయి.ముఖ్యంగా ఏపీలో విజయవాడకు జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. నగరం మధ్యలో వెళుతున్న బుడమేరు పొంగి ప్రవహించడంతో విజయవాడ నగరం అతలాకులమైంది. చరిత్రలో ఎన్నడూ చూడని వర్షం పడటంతో వరద నీరు పోటెత్తింది. విజయవాడ మొత్తం వరదలో కూరుకుపోయింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. చరిత్రలో విజయవాడకు ఇంతటి విపత్తును ఎన్నడూ చూడలేదని అధికారులు చెబుతున్నారు. అటు తెలంగాణలో సైతం భారీ వర్షాలు ప్రజలను తీవ్రంగా నష్టపరిచాయి. వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో 50 మంది వరకు మృత్యువాత పడ్డారు. ప్రభుత్వపరంగా సహాయ చర్యలు ముమ్మరంగా సాగాయి. అదే సమయంలో వరద బాధితులకు విరాళాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు స్పందించారు. పెద్ద ఎత్తున నగదు సాయం ప్రకటించారు. టాలీవుడ్ ప్రముఖులు, హీరోలు రెండు తెలుగు రాష్ట్రాలకు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. అయితే సినీ ప్రముఖులు స్పందించడం ఇదే తొలిసారి కాదు. విపత్తు వచ్చిన ప్రతిసారి మేమున్నాం అంటూ ముందుకు వచ్చి సాయం ప్రకటించారు.
* దివిసీమ విపత్తు సమయంలో..
దివిసీమ తుఫాను సమయంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ధ్వయం జోలె పట్టి విరాళాలు సేకరించారు. తమకున్న స్టార్ డంను పక్కనపెట్టి వరద బాధితులను ఆదుకున్నారు. 1986లో వరదలు వచ్చిన సమయంలో తెలుగు ఇండస్ట్రీ స్పందించిన తీరు అభినందనీయం. భారీ వర్షాలకుగోదావరి పరివాహ ప్రాంతాలు నీటిలో ఉండిపోయాయి.వరదలకు 250 మందికి పైగా మరణించారు.సుమారు లక్ష మంది నిరాశ్రయులయ్యారు. అప్పట్లో రైల్వే ట్రాక్ లు కూడా కొట్టుకు వెళ్లిపోయాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
* అప్పట్లో సాయం ఇదే
అప్పట్లో సినీ హీరోలకు రెమ్యూనరేషన్ అంతంత మాత్రమే. అయినా సరే వరద బాధితులకు భారీగా సాయం చేశారు. సూపర్ స్టార్ కృష్ణ లక్ష రూపాయలు, కృష్ణంరాజు రూ.1.05 లక్షలు, బాలకృష్ణ 2.50 లక్షలు,దాసరి నారాయణరావు లక్ష రూపాయలు, రామానాయుడు 50 వేలు, మెగాస్టార్ చిరంజీవి 50 వేలు, అక్కినేని నాగేశ్వరరావు 25 వేలు, అశ్వినిదత్ పదివేలు, విక్రమ్ యూనిట్ తరఫున రెండున్నర లక్షలు సాయం ప్రకటించారు. దాదాపు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు తలో మొత్తం సాయం చేశారు. తమకున్న మంచి మనసును చాటుకున్నారు.
* బాలీవుడ్ ప్రముఖులు సైతం
బాలీవుడ్ ప్రముఖులు సైతం అప్పట్లో స్పందించారు. హీరోలు జితేంద్ర, రాజేష్ కన్నాలు కూడా తమ వంతు సాయంగా చిరు లక్ష అందించారు. తమిళ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ 50,000 చొప్పున, నగేష్ 10,000 అప్పట్లో వరద బాధితులకు అందించారు. హీరోయిన్లు కూడా తమ సాయాన్ని ప్రకటించారు. ఆర్థిక సాయాన్ని అందించారు. శ్రీదేవి, జయప్రద, జయసుధ చెరో రూ. 50 వేలు అందించారు. విజయశాంతి, మాధవి, సుజాత రూ. 10 వేలు..సిల్క్ స్మిత, జయమాలిని 5000,సింగర్ సుశీల 10,000, శైలజ 5000 ఇచ్చారు.
* తాజా విపత్తులో
తాజా విపత్తులో కూడా సినీ ఇండస్ట్రీ స్పందించింది. తెలుగు రాష్ట్రాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. పెద్ద ఎత్తున విరాళాలు అందించింది. చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా.. ప్రముఖ హీరోలంతా సాయం ప్రకటించడం విశేషం. విపత్తు వచ్చిన ప్రతిసారి.. మేమున్నాము అంటూ ముందుకు వస్తున్న తెలుగు సినీ ఇండస్ట్రీ తీరు మాత్రం అభినందనలు అందుకుంటుంది.