Journalists Arrested: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని ఉద్దేశించి ఎన్టీవీలో ఇటీవల ప్రసారమైన కథనానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఎన్టీవీ తెలంగాణ ఇన్ పుట్ ఎడిటర్ దొంతు రమేష్, పరిపూర్ణ చారి, సుధీర్ అనే రిపోర్టర్లను కూడా తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం వారిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు.
రమేష్, సుధీర్, పరిపూర్ణాచారిని పోలీసులు విచారిస్తున్నారని తెలుస్తోంది. వీరి అరెస్టును సహజంగానే ఎన్టీవీ యాజమాన్యం ఖండించింది. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని ఆరోపించింది. తాము ప్రసారం చేసిన కథనానికి సంబంధించి విచారం వ్యక్తం చేసినట్టు వెల్లడించింది. కానీ, ప్రభుత్వం కోరినట్టుగా ఎక్కడ కూడా క్షమాపణ లేకపోవడం.. పైగా ఎన్టీవీ ప్రసారం చేసిన కథనంలో వేరే కోణాలు ఉన్నట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో తేలింది. దీంతో దొంతు రమేష్, పరిపూర్ణాచారి, సుధీర్ ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. దొంతు రమేష్ కుటుంబంతో కలిసి బ్యాంకాక్ వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా.. పోలీసులు విమానాశ్రయంలో పట్టుకున్నారు. వాస్తవానికి ఆయన బ్యాంకాక్ వెళ్తున్నది కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికి అందరూ అనుకున్నారు. కానీ, ఎప్పుడైతే సజ్జనార్ తెర మీదికి వచ్చారో.. అప్పుడే ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. సజ్జనార్ చెప్పిన మాటలతో దొంతు రమేష్ బ్యాంకాక్ ఎందుకు వెళ్తున్నది అందరికీ అర్థమైంది.
ఎన్టీవీలో ప్రసారమైన కథనం తర్వాత ప్రభుత్వం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. దానికంటే ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తనకు ఇంత విషం పోసి చంపండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీవీ ఆ వీడియోను అన్ని సామాజిక మాధ్యమాలలో తొలగించింది. అంతేకాదు ప్రసారం చేసిన కథనానికి సంబంధించి విచారం వ్యక్తం చేసింది. అయితే ఎక్కడ కూడా క్షమాపణ లేకపోవడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. అప్పటికే దర్యాప్తు బృందం అధికారులు విచారణ మొదలుపెట్టారు. ఈ విషయం మొత్తం తెలుసుకున్న దొంతు రమేష్ పోలీసు విచారణను ఎదుర్కోవడం ఇబ్బందికరంగా ఉంటుందని భావించి బ్యాంకాక్ పారిపోతున్నట్టు సిపి సజ్జనార్ ప్రకటించారు. ఆయన బ్యాంకాక్ పారిపోతుండగానే పట్టుకున్నామని వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా ఈ వ్యవహారంలో పొలిటికల్ గేమ్ ఉందని అందరికీ అర్థమైంది.
పిసిసి అధ్యక్షుడిగా నియమితుడైన తర్వాత రేవంత్ రెడ్డి అన్ని మీడియా సంస్థల అధిపతుల దగ్గరికి వెళ్లారు. అందులో ఎన్టీవీ నరేంద్ర చౌదరి కూడా ఉన్నారు. పైగా ఇటీవల నరేంద్ర చౌదరి నిర్వహించిన కోటి దీపోత్సవం కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి సతీసమేతంగా హాజరయ్యారు. నరేంద్ర చౌదరి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగానే వార్తలను ప్రసారం చేశారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎన్టీవీలో ఒక మంత్రికి వ్యతిరేకంగా, ఒక మహిళా అధికారిణి ని కించపరిచే విధంగా కథనం ప్రకారం అందరిలోనూ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఈ వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారడంతో రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. దర్యాప్తు బృందం అధికారులు ఎన్టీవీ ఇన్ పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్ ను అరెస్ట్ చేశారు.. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తీసుకుంది.