Journalists Arrested: వార్త యందు జగతి వర్ధిల్లుతుంది.. వెనకటికి ఓ పాత్రికేయ మహానుభావుడు చెప్పిన బంగారు మాట అది. ఆ మాటలో ఎంతటి లోతైన అర్థం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క మాటను నిత్యం స్మరించుకుంటూ ఉంటే పాత్రికేయులు తమ వృత్తి గత జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. సమాజం నుంచి మన్ననలు పొందుతుంటారు. పాత్రికేయమనేది ఒక ఉద్యోగం కాదు.. అది ఒక బాధ్యత. అ బాధ్యతను నిర్వర్తిస్తే ఆ పాత్రికేయుడికి గౌరవం లభిస్తుంది. సమాజం కూడా సన్మార్గంలో ప్రయాణిస్తుంది.
పాత్రికేయంలో ప్రభుత్వపరంగా ఎటువంటి సంస్థలు ఉండదు. పాత్రికేయాన్ని ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తుంటాయి. పాత్రికేయమనేది ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఒక వారధి లాగా ఉంటుంది కాబట్టి.. సహజంగానే సమాజం పాత్రికేయాన్ని, పాత్రికేయులను లోతైన దృష్టితో చూస్తూ ఉంటుంది. ఎందుకంటే పాత్రికేయులు రాసే వార్తలకు సమాజం ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితమవుతూ ఉంటుంది. ఒక సమస్యను వెలుగులోకి తీసుకువచ్చినప్పుడు.. దానిని పరిష్కరించే బాధ్యత సంబంధిత అధికారులు తీసుకుంటారు. అలా ఒక సమస్యను వెలుగులోకి తీసుకురావడం అనేది మిగతా వ్యవస్థల వల్ల కాదు. ఒకరకంగా పాత్రికేయమనేది నిద్రాణమైన వ్యవస్థలను తట్టి లేపే చర్నాకోల్ లాంటిది.
గజ్జల మల్లారెడ్డి, పతంజలి, బూద రాజు రాధాకృష్ణ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది పాత్రికేయులు తమ నిరాడంబరమైన పాత్రికేయం ద్వారా ఉన్నతమైన విలువలను నెలకొల్పారు. కానీ నేటి కాలంలో పాత్రికేయమనేది ఒక బెదిరింపు వ్యవస్థ లాగా మారిపోయింది. స్థూలంగా చెప్పాలంటే అక్రమార్కులు, దుర్మార్గులు, దోపిడిదారులు, నల్ల సొమ్మును బాగా కూడబెట్టిన వారు పాత్రికేయంలోకి వస్తున్నారు. వీరితోపాటు పార్టీలు కూడా తమ సొంత పాత్రికేయ వ్యవస్థలను నిర్వహిస్తున్నాయి. నచ్చని వాడి మీద అడ్డగోలుగా బురద చల్లుతూ రాక్షసానందం పొందుతున్నాయి. తద్వారా నేను బురద చల్లుతాను, కడుక్కోవడం నీ కర్మ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి బురద పాత్రికేయం దర్జాగా సాగుతోంది. మేనేజ్మెంట్ల లక్ష్యాలకు అనుకూలంగా పాత్రికేయులు పనిచేయాల్సిన దుస్థితి దాపురించింది. ప్రింట్ మీడియాలో పనిచేస్తే సర్కులేషన్ పెంచడం, యాడ్స్ తీసుకురావడం, మేనేజ్మెంట్ చెప్పిన పనులు చేయడం పాత్రికేయుల విధిలాగా మారిపోయింది. ఎలక్ట్రానిక్ మీడియాలో అయితే అడ్డగోలుగా కథనాలను రాయడం.. గిట్టని వాళ్ళ మీద బురద చల్లడం.. బలవంతంగా ప్రకటనలు తీసుకురావడం వంటివి పాత్రికేయుల విధులు లాగా మారిపోయాయి.
పాత్రికేయమంటే వార్తలు రాయడం.. ఉన్నది ఉన్నట్టు రిపోర్ట్ చేయడం.. ఇవన్నీ పక్కకు పోయి మేనేజ్మెంట్ల అత్యాశలకు, పొలిటికల్ లక్ష్యాలకు బలైపోతున్నారు పాత్రికేయులు. ఎన్టీవీ వ్యవహారంలో కూడా జరిగింది ఇదే. వాస్తవానికి ఆ స్థాయిలో నెగిటివ్ కథనాన్ని ప్రసారం చేస్తున్నప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. పైగా ఒక ఐఏఎస్ అధికారి విషయంలో అంతటి అడ్డగోలుగా కథనం ప్రకారం చేశారంటే మేనేజ్మెంట్ ఎంత మూర్ఖంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక మంత్రిని టార్గెట్ చేస్తూ కథనం ప్రసారం చేయడం అది ఏ విలువలకు నిదర్శనమో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి పనికిమాలిన కంటెంట్ రాయడమే ఒక దరిద్రం అనుకుంటే.. దానిని మసాలా దట్టించి చెప్పడం మరొక దరిద్రం. ఇలా చెప్పేది కూడా ఒక మహిళా జర్నలిస్ట్ కావడం మరింత దరిద్రం. ఒక అధికారికి, ఒక మంత్రికి సంబంధం ముడిపెట్టి వార్తను ప్రసారం చేయడం ఎంతవరకు సమంజసం? అదే ఆ చానల్ సీఈవో లేదా చైర్మన్ కుటుంబ సభ్యులలో ఆడవాళ్ళపై ఇలాగే కథనాలు ప్రసారం చేస్తే ఊరుకుంటారా.. ఎన్టీవీ ఇన్ ఫుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్ ను అరెస్టు చేస్తే సో కాల్డ్ జర్నలిస్టులు, యాజమాన్యం నానా యాగీ చేస్తోంది. వాస్తవానికి ఇంతటి హంగామాలో కనీసం ఒక శాతమైనా ప్రసారం చేసిన కథనం విషయంలో ప్రదర్శించి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది.
ఎటువంటి వివరణ లేకుండా అడ్డగోలుగా కథనాన్ని ప్రసారం చేసిన తర్వాత.. ప్రభుత్వం ఉక్కు పాదం మోపిన తర్వాత ఎన్టివి మేనేజ్మెంట్ సైలెంట్ అయిపోయింది. కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా విచారం వ్యక్తం చేసింది. పైగా తాను ప్రసారం చేసిన కథనంలో అన్ని నిజాలే ఉన్నట్టు జబ్బలు చరుచుకుంది. వాస్తవానికి ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటే ఒక మహిళ అధికారి పరువును ఇలా తీయడం కాదు.. ఆధారాలు లేకుండా అతేంటిసిటీ లేకుండా ఇష్టానుసారంగా ప్రసారం చేయడం అసలు కాదు.. తంబ్ నైల్స్ కోసం.. షాకింగ్, సంచలనమంటూ హోరెత్తించడం కాదు. యూట్యూబ్ లో వీక్షణల కోసం.. నచ్చిన రాజకీయ పార్టీ మెప్పుకోసం ఒక ఐఏఎస్ అధికారిపై ఇటువంటి దారుణమైన కథనాన్ని ప్రసారం చేయడం అసలు కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతటి చర్చకు కారణమైన ఎన్టీవీ.. తాను ప్రసారం చేసిన కథనంపై ఇప్పటికి క్షమాపణ చెప్పకపోవడం విడ్డూరం. అసలు ఇటువంటి వ్యక్తులు ఒక ఛానల్ నిర్వహించడాన్ని జర్నలిజం అనరు.. దానికి గనక అక్షర రూపం ఇస్తే ఖచ్చితంగా అరాచకం అంటారు.