NTR : ఎన్టీఆర్ ఆ మోజు తీరకుండానే..

విశాఖలోని భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలని ఉన్నా వీలుపడలేదట. సువిశాల సాగర తీరం ఉన్న ఈ నియోజకవర్గం చూడచక్కనైనది. అటువంటి నియోకవర్గాన్ని ఓ సీఎం ప్రాతినిధ్యం వహించి ఉంటే ఓ స్థాయిలో ఉండేదని.. ఇప్పటికీ ఇక్కడి స్థానికులు బాధపడుతుంటారు.

Written By: Dharma, Updated On : May 29, 2023 10:46 am
Follow us on

NTR : ప్రతీ రాజకీయ నాయకుడి జీవితంలో తెలియని వెలితి ఉంటుంది. ఏదో ఒక అత్యున్నత స్థాయి పదవి చేపట్టాలని ఉంటుంది. అది తీరకపోతే మనసులో బాధ ఉంటుంది. అయితే ఎన్టీఆర్ విషయంలో కూడా అదేరకమైన బాధ ఒకటుండిపోయిందట. విశాఖలోని భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలని ఉన్నా వీలుపడలేదట. సువిశాల సాగర తీరం ఉన్న ఈ నియోజకవర్గం చూడచక్కనైనది. అటువంటి నియోకవర్గాన్ని ఓ సీఎం ప్రాతినిధ్యం వహించి ఉంటే ఓ స్థాయిలో ఉండేదని.. ఇప్పటికీ ఇక్కడి స్థానికులు బాధపడుతుంటారు.

ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఒక స్ట్రాటజీ పెట్టుకున్నారు. ఎన్నికల్లో ఆయన రెండు, మూడు నియోజకవర్గాల నుంచి బరిలో దిగడం ఆనవాయితీ. 13 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్న ఎన్టీఆర్ నాలుగు సార్లు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు, ఉమ్మడి ఏపీలోని అన్ని ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చివరిసారిగా ఎన్టీఆర్ 1994 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు. అనంతపురం జిల్లా హిందూపురంతో పాటు ఉత్తరాంధ్ర నుంచి ఏదో ఒక నియోజకవర్గంలో పోటీచేయాలని భావించారు. తర్జనభర్జన నడుమ శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీచేశారు.

అప్పట్లో భీమునిపట్నం నుంచి పోటీ చేయాలని ఎన్టీఆర్ చాలా ముచ్చట పడ్డారు. దీంతో భీమిలీ నుంచి రెండు సార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేకి చివరి నిముషం వరకూ భీ ఫారం కూడా ఇవ్వలేదు. భీమిలీ నుంచి పోటీ ఖాయమని అంతా అనుకున్న టైం లో ఏం జరిగిందో ఏమో అన్న గారి గాలి కాస్తా శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైపుగా వెళ్ళింది. అత్యంత వెనకబడిన శ్రీకాకుళం జిల్లా నుంచి పోటీ చేయాలని లాస్ట్ మినిట్ తో డెసిషన్ మార్చుకోవడంతో భీమిలీ ఎమ్మెల్యే  సీఎం అయ్యే చాన్స్ తప్పిపోయింది. అయితే చాలా రోజుల ముందు నుంచే ఎన్టీఆర్ అన్నిరకాలుగా వర్కవుట్ చేసుకున్నారు. కానీ ఎందుకో చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు.

ఇప్పటికీ భీమిలి నియోజకవర్గం పర్యాటకంగా అభివృద్ధి చెందింది. ఈ నియోజకవర్గంలో చూడచక్కని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. సినిమా షూటింగులకు అనువైన ప్రాంతంగా గుర్తింపు పొందింది. అయితే ఎన్టీఆర్ భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి ఉంటే దశ తిరిగి ఉండేదని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సినీ పర్యాటకంగా  మరిన్ని ప్రాజెక్టులు వచ్చే అవకాశాలుండేవని భావిస్తున్నారు. భీమిలి నుంచి ప్రాతినిధ్యం వహించాలన్న ఎన్టీఆర్ కోరిక తీరలేదు. ఇటు ఆ నియోజకవర్గ ప్రజల ఆశలుతీరలేదు. సో ఉభయ పక్షాలకు ఈ విషయంలో లోటే.