AP DSC Notification: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ఏ క్షణమైనా విడుదల కానుంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నగారా మోగనుంది. ఇటువంటి తరుణంలో జగన్ సర్కార్ ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టడం విశేషం. ముఖ్యంగా మెగా డీఎస్సీ అంటూ హడావిడి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు నాలుగున్నర సంవత్సరాల పాటు అదిగో ఇదిగో అంటూ వస్తున్న ప్రభుత్వం.. సరిగ్గా ఎన్నికల ముంగిట ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని చెబుతుండడం ఆశ్చర్యం వేస్తోంది. నిరుద్యోగ అభ్యర్థులు ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకోని సీఎం.. ఎన్నికల షెడ్యూల్ ముందర నియామకాలు చేపడతామని చెబుతుండడం విమర్శలకు తావిస్తోంది.
టిడిపి ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 మధ్య రెండు డీఎస్సీల ప్రకటన వచ్చింది. 2014లో 10313 పోస్టులను భర్తీ చేశారు. 2018లో 7902 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా డీఎస్సీ ప్రకటించలేదు. పైగా చంద్రబాబు సర్కార్ ప్రకటించిన ఉపాధ్యాయ పోస్టులను చూసి విపక్ష నేతగా ఉన్న జగన్ ఎద్దేవా చేశారు. అవి ఒక పోస్టులేనా అని ఎగతాళి చేశారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తానని ప్రకటించారు. కానీ గత 56 నెలలుగా దాని గురించి మరిచిపోయిన జగన్.. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముంగిట నోటిఫికేషన్ జారీ చేస్తానని చెబుతుండడం విమర్శలకు తావిస్తోంది. ఇది ముమ్మాటికీ నిరుద్యోగ యువతను దగా చేయడమేనని విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో 28 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం 18,520 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నట్లు శాసనసభలో ప్రకటించారు. వాస్తవానికి విపక్ష నేతగా ఉన్న జగన్ రాష్ట్రవ్యాప్తంగా 23 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నాడు ప్రకటించారు. గత ఐదు సంవత్సరాలుగా వేలాది మంది పదవీ విరమణ పొందారు. ఈ లెక్కన 30 వేల పోస్టుల వరకు ఖాళీలు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు అదే జగన్ 6000 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నాడు ఇదే జగన్ 7902 పోస్టులకు చంద్రబాబు సర్కార్ నోటిఫికేషన్ ఇస్తే ఎగతాళి చేశారు. కానీ ఇప్పుడు ఆయనే వెయ్యి వరకు పోస్టులు కోత విధించి.. నాలుగున్నర సంవత్సరాల తరువాత డీఎస్సీ ప్రకటనకు సిద్ధపడుతుండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు కానీ.. ఉద్యోగాల నియామకాలు కానీ.. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో చేపడితేనే దానిని చిత్తశుద్ధి అంటారని జగన్ పదేపదే చెప్పుకొచ్చేవారు. ఇప్పుడు ఆయనే ఎన్నికలకు నెల రోజుల ముందు డీఎస్సీ ప్రకటన కు సిద్ధపడుతుండడాన్ని ఏమనాలి. ఇప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన పరీక్ష నిర్వహణ మాత్రం వచ్చే ప్రభుత్వంలోనే చేయాలి. డీఎస్సీ ప్రకటనకు, పరీక్ష నిర్వహణకు మధ్య 40 రోజుల సమయం ఇవ్వాలి. ఇప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ జరిగే నాటికి ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. అప్పుడు పరీక్ష నిర్వహణ కూడా సాధ్యం కాదు. అయితే ఇది తెలిసే జగన్ సర్కార్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందుకొచ్చిందా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 7752 ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్, ఎస్జిటి పోస్టులను ప్రభుత్వం రద్దు చేసింది. కేవలం 1862 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంకు రుణం కోసం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసిందన్న అపవాదు జగన్ సర్కార్ పై ఉంది. ఇప్పుడు ఎన్నికల ముంగిట డీఎస్సీ ప్రకటనకు సిద్ధపడుతుండడం కూడా ఆ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.