Notice to Kodali Nani : ఏపీ ప్రభుత్వం( AP government) దూకుడు మీద ఉంది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్టులు, కేసుల నమోదు విషయంలో దూకుడు ప్రదర్శిస్తోంది. మద్యం కుంభకోణంలో ఒకవైపు అరెస్టులు జరుగుతున్నాయి. మరోవైపు వల్లభనేని వంశీ మోహన్ పై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. ఆయన ఇంకా రిమాండ్ ఖైదీగానే కొనసాగుతున్నారు. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని పై లుక్ అవుట్ జారీ అయ్యింది. దేశంలోని అన్ని విమానాశ్రయాలు, పోర్టులకు సర్కులర్ పంపించారు. ఇప్పటికే కొడాలి నాని పై పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఏపీ పోలీసులు ఆయనకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. గత కొంతకాలంగా కొడాలి నాని అనారోగ్యం తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. వైద్యుల సూచన మేరకు అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. అయితే ఆయనపై కేసులు నమోదైన దృష్ట్యా ఏపీ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం విశేషం.
* రాష్ట్రానికి దూరంగా..
ఎన్నికల ఫలితాలు అనంతరం సొంత నియోజకవర్గం గుడివాడకు( Gudivada ) దూరమయ్యారు కొడాలి నాని. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో కూడా యాక్టివ్ తగ్గించారు. అరెస్టు భయంతోనే కొడాలి నాని రాష్ట్రానికి దూరంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తన స్నేహితుడు వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు తర్వాత ఆయనను పరామర్శించేందుకు విజయవాడ వచ్చాడు కొడాలి నాని. తాను ఎక్కడికి పారిపోలేదని.. కేసులకు భయపడేది లేదని మీడియాకు వెల్లడించారు. అయితే తరువాత అనుకోని రీతిలో కొడాలి నాని గుండెపోటుకు గురయ్యారు. హైదరాబాదులో ప్రాథమిక చికిత్స అనంతరం ముంబైలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అక్కడ ఏషియన్ హార్ట్ సెంటర్లో ఆయనకు సర్జరీ జరిగింది. కొద్దిరోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న కొడాలి నాని డిశ్చార్జితో హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే వైద్యుల సూచనల మేరకు ఆయన అమెరికాలో వైద్య పరీక్షల కోసం వెళ్తారని ప్రచారం జరిగింది.
Also Read : చంద్రబాబుపై పోరాటానికే నానిని ఉపయోగించుకోనున్నారా?
* అమెరికా వెళ్తారని ప్రచారం..
అమెరికాకు వెళ్తారన్న నేపథ్యంలో కొడాలి నానికి( Kodali Nani ) లుక్ అవుట్ సర్కులర్ జారీ చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఆన్లైన్ ద్వారా జారీ చేశారు. దేశంలోని అన్ని విమానాశ్రయాలు, కోర్టులకు సర్కులర్ పంపించారు. కొడాలి నాని పై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన దేశం విడిచి వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు ఏపీ పోలీసులు. కొడాలి నాని పై నమోదైన కేసుల విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కదలికలపై నిఘా పెట్టాలని డీజీపీకి టిడిపి రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. కొడాలి నాని అమెరికా వెళ్లకుండా ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయాలని కోరారు. దీనిపై కృష్ణాజిల్లా గంగాధర్ రావు స్పందించారు. పరిశీలనలు జరుపుతున్నారు. అయితే కొడాలి నాని కి రాష్ట్రంలో పాస్పోర్ట్ లేనట్టు సమాచారం. హైదరాబాద్ చిరునామాతో పాస్పోర్ట్ను పొంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
* ఆ ఇద్దరికీ కష్టాలు
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వంలో దూకుడుగా వ్యవహరించి ప్రత్యర్థులపై నోరు పారేసుకున్న నేతలు చాలామంది ఉన్నారు. అటువంటి వారంతా ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. వారిపై వరుస పెట్టి కేసులు నమోదు అవుతున్నాయి. వల్లభనేని వంశీ మోహన్ కు కొన్ని కేసుల్లో బెయిల్ లభిస్తోంది. అదే సమయంలో మరికొన్ని కేసులు నమోదవుతున్నాయి. ఆయన ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. వల్లభనేని వంశీ తో పాటు కొడాలి నాని టిడిపి నాయకత్వంపై విరుచుకు పడడంలో ముందుండేవారు. ఇప్పుడు వీరిద్దరూ చిక్కుల్లో పడ్డారు.