Chandrababu Corruption: స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టెక్నికల్ అంశాలు చుట్టూనే వాదనలు జరుగుతున్నాయి. ఆది నుంచి చంద్రబాబు న్యాయవాదులు టెక్నికల్ అంశాలు చుట్టూనే వాదనలు వినిపించి చంద్రబాబును నిర్దోషిగా కేసు నుంచి బయట పడేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అటు ప్రభుత్వంతో పాటు సిఐడి న్యాయవాదుల సైతం టెక్నికల్ అంశాలతోనే తిప్పి కొడుతున్నారు. వాస్తవానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో 371 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు సిఐడి చెబుతోంది. ఎఫ్ఐఆర్ తో పాటు రిమాండ్ రిపోర్టులో సైతం దీనినే పొందుపరిచింది. అయితే అవినీతి అంశం పక్కదారి పట్టింది. కేసులో 17 ఏ సెక్షన్ మాత్రమే ప్రధానాంశంగా మారిపోయింది.
సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణలో సైతం సెక్షన్ 17 ఏ వాదనలు మాత్రమే వింటామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొనడం విశేషం. దీంతో అంతటా 17 ఏ సెక్షన్ పై చర్చ జరుగుతోంది.స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సెక్షన్ 17 ఏ వర్తిస్తుందా? లేదా? అన్న దాని పైనే వాదనల సుప్రీంకోర్టులో వాడీవేడిగా సాగాయి. ముఖ్యంగా సెక్షన్ 17 ఏ పై గతంలో యశ్వంత్ సిన్హా కేసుతో పాటు పలు కేసుల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పులను ఆయన తరుపు లాయర్లు ఉదహరించారు. 2018 జూలై 18 తర్వాత నమోదైన కేసుల్లో సెక్షన్ 17 ఏ వర్తిస్తుందని.. కాబట్టి ఈ సెక్షన్ ప్రకారం ప్రజాప్రతినిధులపై కేసులు పెట్టి అరెస్టు చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందేనని చంద్రబాబు తరపు న్యాయవాదులు సిద్ధార్థ లూధ్ర, హరీష్ సాల్వే, అభిషేక్ మను సింగ్వి వాదనలు వినిపించారు. స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ భజన్ లాల్, యశ్వంత్ సిన్హా వర్సెస్ సిపిఐ, స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ తేజ్ మల్ చౌదరి కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని చంద్రబాబు తరఫున న్యాయవాదులు గుర్తు చేశారు.
దీనిపై ఏపీ ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గీ సైతం గట్టి వాదనలు వినిపించ గలిగారు. చంద్రబాబు సెక్షన్ 17 వర్తించదన్నారు. నేరం ఎప్పుడు జరిగిందనేది ముఖ్యమని.. సెక్షన్ 17 ఏ వచ్చాక నేరం జరగని విషయాన్ని గుర్తు చేశారు.సెక్షన్ వచ్చింది 2018లో అయితే.. అంతకంటే ముందే నేరం జరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ముందే జరిగిన నేరానికి.. వెనుక రూపొందించిన సెక్షన్ వర్తింపజేయడం నిబంధనలకు విరుద్ధమని వాదిస్తున్నారు. మొత్తానికైతే అటు చంద్రబాబు న్యాయవాదులు, ఇటు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న లాయర్లు అసలు విషయాన్ని మరుగున పరుస్తున్నారు. ఇంతటి హై ప్రొఫైల్ కేసులో ఏ అంశం పైన కేసు పెట్టారో.. అదే అంశం వాదనల్లోకి రాకపోవడం విశేషం. అటు కోర్టు సైతం 17a సెక్షన్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని చెప్పడం కూడా విస్మయ పరుస్తోంది.