AP Legislative Council: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి అతిపెద్ద షాక్ తప్పదా? శాసనమండలి కూటమి హస్తగతం కానుందా? మండలి చైర్మన్ పై వేటు తప్పదా? కోర్టులో ప్రతికూల తీర్పు రాబోతుందా? చైర్మన్ పై కూటమి అవిశ్వాస తీర్మానం పెట్టనుందా? అదే జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టం తప్పదా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలో స్పష్టమైన బలం ఉంది. అయితే చాలామంది ఎమ్మెల్సీలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటికే రాజీనామా చేసిన వారికి ఆమోదం లభించలేదు. చైర్మన్ మోసేన్ రాజు పెండింగ్లో పెట్టారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు.. చైర్మన్ ఫార్మేట్లో రాజీనామా లేఖలు పంపించినా ఆమోదానికి మాత్రం నోచుకోలేదు. చైర్మన్ మోసేన్ రాజు ఉద్దేశపూర్వకంగానే వాటిని తొక్కి పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. అందుకే ఎమ్మెల్సీల రాజీనామా విషయంలో కూటమి వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది.
* ఎమ్మెల్సీల రాజీనామా బాట
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం చవిచూసింది. దీంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు( YSR Congress party MLCs) పోతుల సునీత, కర్రీ పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, జయ మంగళం వెంకటరమణ, మర్రి రాజశేఖర్, జూకీయ ఖానం తదితర ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. మరికొందరు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ మండలి చైర్మన్ మోసేన్ రాజు రాజీనామాలకు ఆమోదం తెలపడం లేదు. అలా ఆమోదం తెలిపిన మరుక్షణం వారి రాజీనామాలు అమల్లోకి వస్తాయి. మళ్లీ ఎన్నికలు జరిగి ఆ ఎమ్మెల్సీ స్థానాలు కూటమి ఖాతాల్లో పడతాయి. అదే జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గి కూటమి బలం పెరుగుతుంది. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఆదేశాలతోనే చైర్మన్ మోసేన్ రాజు అలా వ్యవహరిస్తున్నట్లు ప్రచారంలో ఉంది.
* జరిమానా విధించిన కోర్టు
అయితే ఇటీవల జనసేనలో చేరిన ఎమ్మెల్సీ జయ మంగళం వెంకటరమణ( jayamangalam Venkataramana ) కోర్టును ఆశ్రయించారు. తన రాజీనామా వ్యవహారంలో కోర్టు ఆదేశాలు పాటించడం లేదని.. వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారని.. తనకు అనవసరంగా ఖర్చు అవుతుందని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ విషయంలో ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని ఆగ్రహించిన కోర్టు పదివేల రూపాయల జరిమానా విధించడం సంచలనంగా మారింది. దీంతో ఎమ్మెల్సీల రాజీనామా వ్యవహారంలో కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు కూటమి పార్టీలో చేరారు. ఇదివరకే జయ మంగళం వెంకటరమణ జనసేనలో చేరారు. జాకీయా ఖానం, పోతుల సునీత బిజెపిలో చేరారు. తాజాగా మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రీ పద్మశ్రీ టిడిపిలో చేరారు. దీంతో కోర్టు ఏదో ఒక తీర్పు ఇస్తుందన్న నేపథ్యంలోనే వీరంతా ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం సాగుతోంది.
* దూకుడుకు కళ్లెం
ఒకవేళ వీరి రాజీనామాలు ఆమోదం పొందితే మాత్రం వెనువెంటనే కూటమి మండలి చైర్మన్ మూసేన్ రాజు పై అవిశ్వాసం పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీలు చాలామంది కూటమికి అనుకూలంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. వాస్తవానికి 2028 వరకు మోసేన్ రాజు ఎమ్మెల్సీ పదవి ఉంది. అప్పటివరకు ఆయన చైర్మన్గా కొనసాగే పరిస్థితి ఉండేది. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా మోసేన్ రాజు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఆయనపై అవిశ్వాసం పెట్టి తొలగించేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.