Jagan: ఏపీలో పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది. ఒకవైపు ముమ్మర ప్రచారం సాగుతోంది. మరోవైపు రాజకీయ పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కీలక జిల్లాల్లో ఏకపక్షంగా పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. రాయలసీమలో వైసిపి పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. కూటమి మాత్రం గుంటూరు, కృష్ణ, ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లోమెజారిటీ స్థానాలను దక్కించేందుకు పావులు కదుపుతోంది.అటు సర్వే సంస్థలు సైతం రాయలసీమలో వైసీపీకి, కోస్తాంధ్రలో టిడిపి కూటమికి అనుకూల ఫలితాలు ఇస్తున్నాయి. దీంతో తమకు ప్రతికూలమైన చోట పట్టు సాధించేందుకు పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ప్రస్తుతం జగన్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు గుంటూరులో యాత్ర పూర్తి చేసి.. విజయవాడలో జగన్ అడుగుపెట్టనున్నారు. ఇక్కడ నుంచి విశాఖ వరకు కూటమి ఆధిపత్యం ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అంశాన్ని వివాదంగా మార్చారన్న అపవాదు ఉంది. అమరావతిని నిర్వీర్యం చేసి.. మూడు రాజధానులను తెరపైకి తెచ్చి.. అసలు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చారని విమర్శ ఉంది. కృష్ణా తో పాటు గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో అమరావతి రాజధాని అంశం ప్రభావం చూపుతోందన్న అంచనాలు ఉన్నాయి. ఇక్కడ బస్సు యాత్ర చేపడుతున్న జగన్ రాజధాని అంశంపై ఏం మాట్లాడుతారు? ఇక్కడి ప్రజలను ఎలా కన్వెన్స్ చేస్తారు? అన్నది చర్చనీయాంశంగా మారింది.తప్పకుండా ఈ నాలుగు జిల్లాల్లో పరిస్థితిని మార్చుతారని వైసీపీ నేతలు జగన్ పై ఆశలు పెట్టుకున్నారు. ఈ నాలుగు జిల్లాల్లోనే కీలక ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నారు.
మరోవైపు ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం అధికంగా ఉంటుందన్న అంచనా ఉంది.ఆ రెండు జిల్లాల్లో కూటమి ఏకపక్షంగా విజయం సాధిస్తుందనిమూడు పార్టీల నేతలు ఆశలు పెట్టుకున్నారు. అటు పవన్ సైతం ఉభయగోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైసిపి గెలవకూడదు అన్న కృతనిశ్చయంతో ఉన్నారు. అటు కూటమిలో దాదాపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. అధికారపక్షం ఊహించినంతగా ఆ మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో వివాదాలు జరగలేదు. అటు కూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియలో భాగంగా సీట్లు దక్కని నేతలు చాలామంది వైసీపీలోకి వచ్చారు. కానీ వారితో ఆశించినంత పని జరగడం లేదన్నది వైసీపీలో వాదన. ఈ పరిణామాల క్రమంలో వైసీపీ నేతలు సీఎం జగన్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ నాలుగు జిల్లాల ప్రజలకు జగన్ ఏం హామీలు ఇస్తారు? ఎలా తమ వైపుకు తిప్పుకుంటారు? అన్నది హాట్ టాపిక్ గా మారింది.