Nimmaka Jayakrishna: రాష్ట్రంలో ఎస్టీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు ఉన్నాయి. అవి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలుస్తూ వస్తున్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి సైతం ఆ పార్టీకే చిక్కుతున్నాయి. అయితే ఈసారి ఎలాగైనా అక్కడ ఖాతా తెరవాలని కూటమి భావిస్తోంది. ముఖ్యంగా పాలకొండ నియోజకవర్గం పై ఆశలు పెట్టుకుంది. అక్కడ టిడిపి ఇన్చార్జిగా ఉన్న నిమ్మక జయకృష్ణ జనసేనలో చేరారు. జనసేన అభ్యర్థి అయ్యారు. దీంతో ఇక్కడ మూడు పార్టీలు సమన్వయంతో ఎలాగైనా గెలుపొందాలన్న ఆశతో పని చేస్తున్నాయి. అటు టిడిపి తో పాటు ఇటు జనసేన సాయం తప్పకుండా జయకృష్ణ కు లభించే అవకాశం ఉంది. అదే జరిగితే వైసీపీకి ఇబ్బందికర పరిణామమే.
2009 నుంచి పాలకొండ ఎస్టి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి దక్కలేదు. గత రెండు ఎన్నికల్లో జయకృష్ణ పోటీ చేసి ఓడిపోయారు. 2009లో జయకృష్ణ సోదరుడు పాండురంగ పోటీ చేసినా ఫలితం లేకపోయింది. 2009 వరకు పాలకొండ ఎస్సీ నియోజకవర్గంగా ఉండేది. అప్పట్లో కొత్తూరు ఎస్టీ నియోజకవర్గంగా కొనసాగేది. టిడిపి ఆవిర్భావం తర్వాత నిమ్మక జయకృష్ణ తండ్రి గోపాల్ రావు కొత్తూరు ఎస్టీ నియోజకవర్గంలో నుంచి పోటీ చేసి గెలిచేవారు. వరుసుగా గెలుస్తూ వచ్చిన గోపాల్ రావు ఆకస్మిక మృతితో ఆయన కుమారుడు జయకృష్ణ తెరపైకి వచ్చారు. వరుసగా టిడిపి నుంచి పోటీ చేస్తున్న గెలవలేదు. పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు లభించడంతో ఆ పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసిపి అభ్యర్థిగా విశ్వసరాయి కళావతి ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వస్తున్నారు. ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. కళావతి మంచి వ్యక్తిగా పేరు ఉంది. ఆమె తండ్రి వండువదొర సీనియర్ నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి కీలక పదవులు చేపట్టారు. అయితే ఈసారి కళావతికి వైసీపీలో అసమ్మతి కనిపిస్తోంది. సీనియర్ నేత, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాలవలస రాజశేఖర్ కుటుంబం నుంచి అనుకున్న స్థాయిలో సహాయం అందడం లేదు. అదే సమయంలో జయకృష్ణపై సానుభూతి కనిపిస్తోంది. గత రెండు ఎన్నికల్లో ఓడిపోవడంతో సాఫ్ట్ కార్నర్ ఉంది. పైగా జనసేన అభ్యర్థిగా బరిలో దిగడం, నిన్నటి వరకు టిడిపి ఇన్చార్జిగా కొనసాగడం, బిజెపి శ్రేణులు సైతం సహకారం అందిస్తుండడం జయ కృష్ణకు కలిసి వచ్చే అంశం. మొత్తానికైతే పవన్ గూటికి చేరి జయకృష్ణ తన హస్తవాసిని మార్చుకుంటున్నారన్న టాక్ పాలకొండలో వినిపిస్తోంది. మరి ఎన్నికల్లో ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.