Chandrababu: చంద్రబాబు కేసులో జిమ్మిక్కులు

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. దాదాపు 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కింది కోర్టు నుంచి పై కోర్టు వరకు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

Written By: Dharma, Updated On : February 16, 2024 5:23 pm
Follow us on

Chandrababu: అవినీతి కేసుల్లో చంద్రబాబు బెయిల్ పై బయట ఉన్నారు.రాజకీయ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే మరోసారి స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు బయటకు వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న చంద్రకాంత్ షా అనే వ్యక్తి అప్రూవర్ గా మారుతాడని ఏసీబీ హైకోర్టుకు నివేదించింది. విచారణకు కోరుతూ ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ స్వీకరించిన కోర్టు విచారణను మార్చి 1కి వాయిదా వేసింది.దీంతో చంద్రబాబు కేసు అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది.

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. దాదాపు 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కింది కోర్టు నుంచి పై కోర్టు వరకు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తన అరెస్టు అక్రమమని, కనీస నిబంధనలు పాటించలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. అత్యున్నత న్యాయస్థానంలో చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్ పై విచారణ పూర్తయింది. తీర్పు రిజర్వులో ఉంది. ఇంతలో ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు బెయిల్ లభించింది. అయితే బెయిల్ ఇచ్చిన తీరును సవాల్ చేస్తూ ఏపీ సి ఐ డి సుప్రీంకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సైతం విచారణ కొనసాగుతోంది.

మరోవైపు ఈ కేసులో 31 వ నిందితుడిగా ఉన్న చంద్రకాంత్ షా అప్రూవర్ గా మారారని ఏపీ సీఐడీ చెబుతోంది. హైకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబుకు ముడుపులు అందాయని.. ఈ మేరకు అప్రూవర్ చెబుతున్నారని.. అందుకే ఆయన బెయిల్ రద్దు చేయాలని ఏపీ సిఐడి కోరుతోంది. అయితే ఇప్పటికే ఇది రాజకీయ దురుద్దేశంతో కూడిన కేసు అని చంద్రబాబు తరపు న్యాయవాదులు న్యాయస్థానం ముందు ఉంచారు. ఈ నేపథ్యంలో ఈ కేసు విషయంలో హైకోర్టు ఆచితూచి అడుగులు వేస్తోంది. విచారణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. తాజాగా హైకోర్టులో విచారణకు రాగా ఈ కేసును మార్చి ఒకటికి వాయిదా వేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది.