New Teachers Joining: ఏపీలో మెగా డీఎస్సీ( Mega DSC) పరి సమాప్తం అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఉపాధ్యాయులు ఈరోజు విధుల్లో చేరారు. కొద్ది రోజుల కిందట నియామక పత్రాలను అందించిన సంగతి తెలిసిందే. ఎంపికైన ఉపాధ్యాయులకు శిక్షణ సైతం పూర్తయింది. దీంతో ఈరోజు తమకు కేటాయించిన పాఠశాలల్లో కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరారు. కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగానే ఆరు నెలల వ్యవధిలో డీఎస్సీ నియామక ప్రక్రియను పూర్తి చేసింది. ఉపాధ్యాయులందరికీ పోస్టింగులు ఇచ్చింది. ఈ విషయంలో మాత్రం విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ అభినందనలు అందుకుంటున్నారు. న్యాయపరమైన చిక్కులను అధిగమించి.. సకాలంలో డీఎస్సీ పూర్తి చేయడంలో ఆయన కృషి ఉందని అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
మాట నిలబెట్టుకున్న చంద్రబాబు..
అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చంద్రబాబు( CM Chandrababu) హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టు అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే తొలి ఫైల్ గా సంతకం చేశారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష పూర్తి చేశారు. అన్ని రకాల నిబంధనలను అనుసరించి.. ఈ ఏడాది ఏప్రిల్ 20న 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. దాదాపు నెల రోజులపాటు డీఎస్సీ అభ్యర్థులకు ఆన్లైన్లో పరీక్షలు కూడా పూర్తి చేశారు. మధ్యలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రకరకాలుగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియ పై న్యాయస్థానాలను ఆశ్రయించారు. కానీ నిబంధనల ప్రకారమే ముందుకెళ్లడంతో డీఎస్సీ సజావుగా సాగింది. అయితే కొన్ని పోస్టులకు రిజర్వేషన్ అభ్యర్థులు లేనందున 15941 పోస్టులు భర్తీ అయ్యాయి. మెగా డీఎస్సీలో ఎంపికైన నూతన ఉపాధ్యాయులు ఈరోజు విధుల్లో చేరారు.
మాట తప్పిన జగన్ మోహన్ రెడ్డి..
వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ప్రతి సంవత్సరం డీఎస్సీ ప్రకటిస్తామని జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ అమలు చేయలేకపోయారు. ఒక్కటంటే ఒక్క డీఎస్సీ ప్రకటన కూడా రాలేదు. చివరిగా 2024 ఎన్నికలకు ముందు ఆరువేల ఉపాధ్యాయ పోస్టులతో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ప్రక్రియ ప్రారంభం కాక మునుపే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. దీంతో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ప్రారంభం కాకుండానే నిలిచిపోయింది. అయితే చంద్రబాబు మెగా డీఎస్సీ హామీ ఇవ్వడం.. ఆ హామీని అమలు చేస్తూ 16 వేల 347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేయగలిగారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 15,000 మందికి పైగా కొత్త ఉపాధ్యాయులు ఈరోజు విధుల్లో చేరారు. అయితే తమ ఆశయం నెరవేరడంతో ఉద్విగ్న భరిత వాతావరణంలో వారు పాఠశాలల్లో విధుల్లో చేరడం కనిపించింది. గొప్పగా ఎమోషనల్ అయిన వారు కూడా ఉన్నారు.