New Political Parties In AP: ఏపీలో( Andhra Pradesh) కొత్త పార్టీలు రానున్నాయా? ఆ స్పేస్ ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో ప్రాంతీయ పార్టీల హవా నడుస్తోంది. జాతీయ పార్టీల ప్రభావం అంతంత మాత్రమే. అధికార టిడిపి, జనసేనలు ప్రాంతీయ పార్టీలు. వాటితో అధికారం పంచుకున్న బిజెపి జాతీయ పార్టీ. మరో ప్రతిపక్ష పార్టీగా వైసీపీ ఉంది. అది సైతం ప్రాంతీయ పార్టీ. ఇంకా చిన్నచితకా పార్టీలు ఉండనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రాంతీయ పార్టీల ఏర్పాటు అంశం అనేది హాట్ టాపిక్ అవుతోంది. ప్రధానంగా ఏబీ వెంకటేశ్వరరావు, విజయసాయిరెడ్డి, షర్మిలాలు కొత్త పార్టీలు పెడతారని ప్రచారం నడుస్తోంది. అయితే ఈ ముగ్గురు పార్టీలు పెడితే ఎవరికి నష్టం అంటే మాత్రం.. కచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి. అయితే ఆ ముగ్గురు టార్గెట్ సైతం జగన్మోహన్ రెడ్డి పార్టీ అని తెలుస్తోంది. వారి పార్టీల ఏర్పాటు వెనుక కూడా ఒక రకమైన వ్యూహం ఉన్నట్లు సమాచారం. అయితే వారి పార్టీ ప్రకటన నేరుగా లేదు కానీ ప్రచారం మాత్రం జరుగుతోంది.
* ఏబీ వెంకటేశ్వరరావు ప్రకటన..
ఏబీ వెంకటేశ్వరరావు( ab Venkateswarao) జగన్మోహన్ రెడ్డి సర్కార్ బాధిత అధికారి. 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి సర్కార్లు ఆయన ఇంటలిజెన్స్ అధికారిగా పనిచేశారు. అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలు చాలామంది టీడీపీలో చేరారు. ఆ సమయంలో నిఘా అధిపతిగా ఉన్న ఆయన టిడిపికి అనుకూలంగా పనిచేశారన్న అనుమానం జగన్ లో ఉండేది. అందుకే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాధితుడిగా మారారు ఏబీ వెంకటేశ్వరరావు. ఈ రాష్ట్రానికి డిజిపి కావాల్సిన అధికారి లూప్ హోల్స్ లో ఉండిపోయారు. ప్రమోషన్ పొందిన నాడే పదవీ విరమణ చేశారు. అయితే ఇంతటి మూల్యాన్ని చెల్లించుకున్న తనకు తెలుగుదేశం అధికారంలోకి వస్తే మంచి గుర్తింపు ఉంటుందని భావించారు. అయితే తన ఆలోచనకు తగ్గట్టు టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తింపు, పదవి దక్కలేదు. పైగా తాను ఆశించినట్టు వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి ట్రీట్మెంట్ ఇవ్వడం లేదన్న ఆవేదన ఉంది. మరోవైపు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సైతం తనకు ఇబ్బందులు ఉన్నాయి. అందుకే ఆయన కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని ఇటీవల ప్రకటించారు.
* విజయసాయిరెడ్డి సైతం..
మరోవైపు విజయసాయిరెడ్డి( Vijay Sai Reddy ) కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం నడుస్తోంది. ఏడాది కిందట ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ సభ్యత్వంతో పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఇకనుంచి వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు.. అయితే ఆయన రూటు మార్చినట్టు కనిపిస్తున్నారు. ఇటీవల నిత్యం జగన్ కోటరిని టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించే వీలుగా ఒక కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. దీని వెనుక తెలుగుదేశం హస్తం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మరోసారి రెడ్డి సామాజిక వర్గం మద్దతు జగన్మోహన్ రెడ్డికి దక్కకుండా విజయసాయిరెడ్డి తో పార్టీని ఏర్పాటు చేయిస్తున్నారన్న ప్రచారం మాత్రం జరుగుతోంది.
* ప్రత్యేక రాయలసీమ కోసం..
వైయస్ షర్మిల( Y S Sharmila ) కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారని కూడా టాక్ నడుస్తోంది. తెలంగాణలో తన తండ్రి పేరిట పార్టీ ఏర్పాటు చేసిన షర్మిల అక్కడ నడపలేకపోయారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ పగ్గాలు అందుకున్నారు. సోదరుడు జగన్తో వచ్చిన విభేదాలతో ఆయనను అధికారం నుంచి దూరం చేయాలని చూసారు. ఆ విషయంలో సక్సెస్ అయిన ఏపీలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కాలేదు. అందుకే కాంగ్రెస్ అధినాయకత్వం షర్మిలను తప్పిస్తుందన్న ప్రచారం నడుస్తోంది. ఈ తరుణంలో ఆమె ప్రత్యేక రాయలసీమ సాధన కోసం ఒక పార్టీని ఏర్పాటు చేస్తారని టాక్ నడుస్తోంది. ఇటీవల రాజకీయంగా యాక్టివిటీస్ తగ్గించారు షర్మిల. అందుకే ఈ ప్రచారం మరింతగా సాగుతోంది. అయితే వీరు రాజకీయ పార్టీలు ఏర్పాటు చేస్తారు అనేది ఒక్క ప్రచారం మాత్రమే. వారు పార్టీలు ఏర్పాటు చేస్తే మాత్రం అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించే విషయమే.
