YCP Senior Leaders: ఏపీలో ( Andhra Pradesh) ఇప్పుడు అందరి దృష్టి విజయసాయిరెడ్డి పై ఉంది. మద్యం కుంభకోణం కేసులో ఈడి ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఈనెల 23న ఈడీ ఎదుటకు ఆయన హాజరుకానున్నారు. ఆ మరుసటి రోజు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి సైతం ఈడి ఎదుటకు రానున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఏపీ సిఐడి దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో విజయసాయిరెడ్డి తో పాటు మిధున్ రెడ్డి నిందితులు. అయితే మిధున్ రెడ్డి మాత్రమే జైలుకు వెళ్లి వచ్చారు. అరెస్టు కాకుండా మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. కానీ చివరకు అత్యున్నత న్యాయస్థానం ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో మిధున్ రెడ్డికి రిమాండ్ ఇబ్బందులు తప్పలేదు. అయితే విచారణ పేరిట విజయసాయిరెడ్డి రెండుసార్లు హాజరయ్యారు. కానీ ఆయన అరెస్టు జరగలేదు. మిథున్ రెడ్డి మాత్రం విచారణ తో పాటు జైలుకెళ్ళి వచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఈడి ఎదుటకు హాజరు కానుండడం విశేషం.
* విజయ సాయి వివరాలతోనే..
ఈ కేసులో విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) అప్రూవర్ గా మారినట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ అప్పట్లో ప్రతి వ్యవహారంలోనూ విజయసాయిరెడ్డి పాత్ర ఉంది. అందుకే అప్పటి వివరాలు అందించి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి. ఆ కారణంతోనే ఆయన అరెస్టు జరగలేదు కూడా. మద్యం కుంభకోణం కేసులు రాజ్ కసిరెడ్డి సూత్రధారి అని విజయసాయిరెడ్డి ఇదివరకే ప్రకటించారు. విజయసాయిరెడ్డి నోరు తెరిచిన తర్వాతే పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి తో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వారి అరెస్టు జరిగింది. కచ్చితంగా విజయసాయిరెడ్డి ఇచ్చిన ఆధారాలతోనే అరెస్టు జరిగి ఉంటుందన్న అనుమానం వైసిపి నేతల్లో కూడా ఉంది. ఇప్పుడు అదే విజయసాయిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరుకానుండడం సంచలనంగా మారుతుంది. కచ్చితంగా విలువైన సమాచారాన్ని ఆయన ఇస్తారని కూడా తెలుస్తోంది. ఇప్పటికే జగన్ చుట్టూ ఉన్న కోటరీ పై సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చారు విజయసాయిరెడ్డి. ఇప్పుడు ఆ కోటరీ లోని కీలక నేతలు మద్యం కుంభకోణం లో ఉన్నారు. తప్పనిసరిగా వారికి సంబంధించిన సమాచారం విజయసాయిరెడ్డి ఇస్తారని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
* బిజెపి నేతల హెచ్చరికలు..
మరోవైపు బిజెపి నేతలు( BJP leaders ) వరుస పెట్టి ముందుకు వస్తున్నారు. ఇప్పటివరకు మంత్రి సత్య కుమార్ యాదవ్ మాత్రమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సైతం వైసీపీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. మద్యం కుంభకోణంలో నిందితులకు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగిందని కూడా చెబుతున్నారు. మొన్నటికి మొన్న బిజెపి ఎంపీలను పిలిచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు బిజెపి నేతలు ఆరోపణలు చేస్తుండడం.. కేంద్రం పరిధిలోని పనిచేసే ఈడి రంగంలోకి దిగడం వంటివి చూస్తుంటే ఏదో జరగబోతోంది అన్న అనుమానం వైసీపీ సీనియర్లలో ఉంది. చూడాలి మరి అలాంటి పరిణామాలు జరుగుతాయో…
