YS Jagan : ఏపీ సీఎం దూకుడు కనబరుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. పార్టీ నియామకాలను చేపడుతున్నారు. గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా కీలక నియోజకవర్గాల్లో నాయకత్వాలను పటిష్టం చేసే పనిలో పడ్డారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గానికి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గానికి దువ్వాడ వాణిని వైసీపీ సమన్వయకర్తలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులను జారీచేశారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి కీలక నియోజకవర్గం. ఇక్కడ నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ బహిష్కృత నేతగా ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటువేశారని కారణం చూపుతూ వైసీపీ హైకమాండ్ వేటు వేసింది. దీంతో ఇక్కడ వైసీపీకి నాయకత్వ సమస్య ఏర్పడింది. అయితే అనూహ్యంగా చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు, సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డికి సమన్వయ బాధ్యతలను అప్పగిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ ఆవిర్భావం నుంచి చంద్రశేఖర్ రెడ్డి జగన్ వెంట నడిచారు. అప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నా జగన్ వైపే మొగ్గుచూపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లి గెలిచారు. 2014, 19 ఎన్నికల్లో సైతం గెలుపొందారు. అయితే కుటుంబపరంగా వచ్చిన సమస్యల విషయంలో జగన్ అతడిపై అనుమానపు చూపులు చూశారు. అటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని అనుమానిస్తూ వైసీపీ నుంచి వేటు వేశారు. ఇప్పుడు ఆయన సోదరుడికి ఉదయగిరి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ బాధ్యతలను దువ్వాడ వాణికి కట్టబెట్టారు. ఈమె ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో కూడా అచ్చెన్న పట్టు నిలుపుకుంటూ వచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలన్న ఉద్దేశ్యంతో జగన్ దువ్వాడ శ్రీనివాస్ ను ప్రోత్సహించారు. నియోజకవర్గ ఇన్ చార్జితో పాటు ఎమ్మెల్సీగా కూడా అవకాశమిచ్చారు. అయితే అందర్నీ కలుపుకెళ్లడంలో దువ్వాడ వెనుకబడ్డారు. పైగా కుటుంబ వివాదం ఒకటి బయటకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో తనకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని భార్య డిమాండ్ చేసినట్టు సమాచారం. సీఎం వద్ద పంచాయితీ జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దువ్వాడ వాణికి నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది.