Nano Urea Liquid Fertilizer: ఏపీలో( Andhra Pradesh) యూరియా కొరత పొలిటికల్ హీట్ ఎక్కించింది. ప్రభుత్వం యూరియా కొరత లేకుండా చేసాం అంటూ ప్రకటన చేసింది. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూరియాను పెద్ద ఎత్తున అందుబాటులోకి తెస్తోంది ఏపీ ప్రభుత్వం. మరోవైపు నానో యూరియా సైతం అందుబాటులోకి వచ్చింది. బస్తాలను మోసుకెళ్లే పని లేకుండా అర లీటర్ నానో యూరియా వాడితే సరిపోతుంది. అంటే ద్రవ రూపంలో ఈ నానో యూరియా అందుబాటులోకి వచ్చింది. దీని వినియోగం కూడా చాలా సులువు అని చెబుతున్నారు అధికారులు. యూరియా కొరత ఉన్న నేపథ్యంలో ఈ నానో యూరియా వాడాలని అధికారులు సూచిస్తున్నారు. వరి, పత్తి వంటి పంటలపై ఈ నానో యూరియా పిచ్చికారి చేయవచ్చు. గత కొద్దిరోజులుగా అధికారులు అవగాహన పెంచడంతో ఈ నానో యూరియా వాడకం పెరిగింది.
ఇంకా పాత పద్ధతిలోనే..
అయితే ఇప్పటివరకు ఏపీలో పాత పద్ధతిలోనే ఎరువులను వాడుతున్నారు. నానో యూరియాతో( naano urea) అధిక ప్రయోజనాలు ఉన్న దాని జోలికి పోవడం లేదు. వ్యవసాయ శాఖ నిపుణులు, శాస్త్రవేత్తలు యూరియాకు బదులుగా నానో యూరియా వాడాలని సూచిస్తున్నారు. సాధారణ యూరియా బస్తాలో ఉండే పోషకాలు.. అర లీటరు నానో యూరియాలో ఉంటాయని చెబుతున్నారు. సాధారణ యూరియా గుళికల రూపంలో ఉంటే.. నానో యూరియా ద్రవ రూపంలో ఉంటుంది. సాధారణంగా రైతులు ఉపయోగించే యూరియాలో కణాల పరిణామం 2.8-4 మిల్లీ మైక్రాన్లు ఉంటే.. అందులో మొక్కకు 30% వరకు మాత్రమే చేరుతుంది. మిగిలిన యూరియా నీటిలోనూ, భూమిలోను కలిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
నానో యూరియా అలా కాదు..
శత శాతం పంటలకు ఉపయోగపడుతుంది. ఈ నానో యూరియా కణాల పరిణామం 32 నానో మైక్రాన్లు ఉంటుంది. ఏకంగా 80% పైగా మొక్కకు చేరుతుంది. అస్సలు వృధా ఉండదు. కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంది. రైతులు ఉపయోగిస్తున్న సాధారణ యూరియా వేర్ల ద్వారా మొక్కకు అందెందుకు ఆలస్యం అవుతుంది. నానో యూరియా అలా మొక్కల ఆకులపై పిచికారి చేయగానే నేరుగా పత్ర హరితానికి చేరి వెంటనే ప్రభావం చూపుతుంది. ఎకరాకు అర లీటరు నానో యూరియా సరిపోతుంది. సాధారణ యూరియాతో పోల్చుకుంటే ధర కూడా తక్కువ. రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది.