spot_img
Homeఆంధ్రప్రదేశ్‌TV9 Trolling: టీవీ9.. ముందు నీది నువ్వు కడుక్కో

TV9 Trolling: టీవీ9.. ముందు నీది నువ్వు కడుక్కో

TV9 Trolling: నెంబర్ వన్ స్థానం కోల్పోయిన దగ్గరనుంచి టీవీ9 పెద్దలకు ఏం చేస్తున్నారో సోయి లేనట్టు కనిపిస్తోంది. పెద్దలు మాత్రమే కాదు కింది స్థాయిలో ఉద్యోగులు కూడా నాకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా అక్కడి పరిస్థితి ఉంది. రోజురోజుకు రేటింగ్స్ తగ్గిపోవడం ఆ ఛానల్ దీనావస్థను సూచిస్తోంది. తర్వాత స్థానంలో ఉన్న టీవీ 5, వి6 వెలుగు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సరైన పటిమ చూపించడం లేదు కాబట్టి టీవీ9 రెండవ స్థానంలో కొనసాగుతోంది. అవి గనుక ఏమాత్రం ప్రొఫెషనలిజం చూపించినా టీవీ9 అడ్రస్ గల్లంతు కావడం ఖాయం.

ఏం చదువుతున్నారో సోయి ఉందా?

ఆ మధ్య హైదరాబాద్ లో వర్షాలు కురిసినప్పుడు ” పైనుంచి రుధిరం కారుతోందా అన్నట్టుగా వర్షం కురుస్తోంది” అని దేవి వార్త లీడ్ చదివింది. దీంతో ఒక్కసారిగా చూసే ప్రేక్షకులకు మతి పోయినంత పనైంది. దేవి సీనియర్ యాంకర్. ఇలాంటి వారికి స్క్రిప్ట్ రాయాల్సిన అవసరం లేదు. అలావోకగా వార్తలు చెప్పగలదు. అలాంటి యాంకర్ రుధిరం అనే పదాన్ని ఎక్కడ వాడతారో తెలియకుండా.. వర్షం తీవ్రతను సంబోధించేందుకు వాడటం చర్చకు దారి తీసింది. దీంతో కొద్ది రోజులపాటు ఆమె సోషల్ మీడియాలో ట్రోల్ కు గురయింది. ఈ ఎపిసోడ్ ముగిసిన తర్వాత మళ్లీ విశ్వక్ సేన్ తో “గేట్ అవుట్” వివాదంలో మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్ కు గురయింది. సరే ఇవన్నీ ఛానల్ వ్యక్తిగత వ్యవహారాలు అని పక్కన పెడదాం. మరి ఇదే ఛానల్ నెంబర్ వన్ న్యూ నెట్వర్క్ అని ప్రచారం చేసుకుంటుంది కదా! ఉదయం లేస్తే ఎన్నో విషయాలపై సమాచారాన్ని ఇస్తుంది కదా! కొన్ని కొన్ని విషయాలపై తన సొంత భాష్యం కూడా చెబుతుంది కదా! అలాంటప్పుడు ఈ ఛానల్ కు బాధ్యత లేదా? అనే ప్రశ్న జనాల నుంచి రావడం సమంజసమే కదా!

రజనీ కాంత్ కు ఎందుకు అర్థం కావడం లేదు.

టీవీ9 భాష విషయంలోనే కాదు వార్తను ప్రజెంట్ చేసే విషయంలోనూ హడావిడి కి పాల్పడుతోంది. ప్లెయిన్ అండ్ నీట్ కవరేజ్ కు ఎప్పుడో మంగళం పలికింది.. వాగాడంబరం తప్ప విషయాడంబరాన్ని గాలికి వదిలేసింది. ఫలితంగానే ఎన్టీవీ కి నెంబర్ వన్ స్థానాన్ని పువ్వుల్లో పెట్టి ఇచ్చింది. జనాల మనసులు ఎలా దోచుకోవాలో తెలియకుండా “కుట్రలతో నెంబర్ వన్ స్థానం ఎప్పటికీ దక్కించుకోలేరు” అంటూ రెండు కోట్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, జనాల మదిలో మరింత చులకన అయిపోయింది. ప్రైమ్ టైం డిబేట్లో పక్కా ఆధారాలతో ప్రశ్నలు అడిగే రజనీకాంత్.. మరి ఈ విషయంలో ఎందుకు అంతగా కేర్ తీసుకోలేకపోతున్నట్టు? ఇతర పార్టీల రాజకీయ నాయకుల నాయకత్వాన్ని ప్రశ్నించే రజినీకాంత్.. తన సారథ్యంలో కీలక ఉద్యోగులు బయటికి వెళ్లిపోతుంటే ఏం చేస్తున్నట్టు? ఇలాంటి సందర్భంలోనే “ఏయ్ టీవీ9 ముందు నువ్వు నీది కడుక్కో” అనే వ్యాఖ్యలు నెటిజన్ల నుంచి వస్తున్నాయి.

భూతద్దం లో పెట్టి చూస్తోంది

వాలంటీర్ల గురించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను నిన్నటి నుంచి టీవీ9 ఛానల్ అదే పనిగా ప్రసారం చేస్తోంది. గతంలో జరిగిన సంఘటనలను పక్కనపెట్టి వాలంటీర్ల వ్యవస్థను పవన్ కళ్యాణ్ కావాలనే బజారుకు లాగుతున్నారని శోకాలు పెడుతోంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థ గురించి కాదు మాట్లాడింది. కొంతమంది వల్ల వారి వ్యవస్థకు చెడ్డ పేరు వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. కానీ ఇక్కడే రేటింగ్స్ కోసం టీవీ9 అడ్డదారులు తొక్కడం ప్రారంభించింది. అడ్డగోలుగా వార్తలు ప్రసారం చేస్తున్నది. పవన్ కళ్యాణ్ దేశద్రోహం చేసినట్టు సూత్రికరిస్తోంది.. నెంబర్ వన్ న్యూస్ నెట్వర్క్ అని ప్రచారం చేసుకుంటున్న టీవీ9 ఒక్కసారి తన తప్పులు ఏంటో చెక్ చేసుకుంటోందా? అసలు పరిశీలన వ్యవస్థ అనేది టీవీ9 లో ఉందా అంటే? అంటే దీనికి సమాధానాలు లభించడం కష్టం. ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ వాలంటీర్ల గురించి ఏం మాట్లాడాడు? అందులో ఎటువంటి బొక్కలు వెతుకుదాం? రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశాడు? దానిని భూ తద్దం లో పెట్టి ఎలా చూద్దాం అనే విషయాల మీద మాత్రమే టీవీ9 దృష్టి సారిస్తోంది. వార్తను వార్తగా కాకుండా సంచలన విషయంగా జనాల్లోకి తీసుకెళ్తోంది. దీనినే “మెరుగైన సమాజం” కోసం అంటూ ప్రచారం చేసుకుంటున్నది. మిగతా ఛానెల్స్ ఇంతకంటే దారుణంగా ఉన్నప్పటికీ టీవీ9 నే ఎందుకు పాయింట్ అవుట్ చేయాల్సి వస్తుంది అంటే.. “మెరుగైన సమాజం” అంటూ గత 19 ఏళ్లుగా మన టీవీల్లో తిష్ట వేసుకుని కూర్చున్నది కాబట్టి.. ఈ తెలుగు సమాజం ఆ ఛానల్ కు చాలానే ఇచ్చింది కాబట్టి.. కానీ తిరిగి ఇవ్వడంలో మాత్రం ఆ ఛానల్ విఫలమైంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version