Lady Don Kamakshi: కామాక్షి.. ఎంతో అందమైన పేరు కదా… పైగా కంచిలో కొలువై ఉన్న అమ్మవారు.. అటువంటి పేరు పెట్టుకున్న ఈమె మాత్రం పెద్ద ఖిలాడీ. చూసేందుకు అమాయకంగా ఉంటుంది.. చేసేవి మాత్రం దారుణాలు.. ఘోరాలు.. అన్నింటికీ మించి గంజాయి అక్రమ రవాణా.. కామాక్షి గురించి పోలీసులకు తెలిసిన తర్వాత లోతుగా దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. దీంతో దిగ్బ్రాంతి కరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
నెల్లూరు నగరానికి చెందిన సిపిఎం నాయకుడు పెంచలయ్య ను కామాక్షి అనుచరులు అంతం చేశారు. ఈ కేసులో తమకు అందిన సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తుండగా కామాక్షి గురించి బయటపడింది.. ఆ తర్వాత ఆమె గంజాయి లీలలు కూడా పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి.. కామాక్షి భర్త పేరు జోసెఫ్. వీరు బొడిగాడి తోట అహ్మద్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటారు.. ప్రస్తుతం కామాక్షి దంపతులు వైకుంటపురం సమీపంలో నివాసం ఉంటున్నారు. గత నెల 28న నెల్లూరు రూరల్ మండలం కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద పెంచలయ్యను కామాక్షి అనుచరులు అంతం చేశారు. ఈ కేసులో కామాక్షి ప్రధాన నిందితురాలిగా ఉంది. పెంచలయ్య హత్య కేసును విచారిస్తున్న కార్యక్రమంలో కామాక్షి దంపతుల అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నెల్లూరు రూరల్ ఇన్స్పెక్టర్ వేణు ఆధ్వర్యంలో గత శనివారం కామాక్షిని ఆమె ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు.
కామాక్షిని ఇంటి తాళాలు ఇవ్వాలని కోరితే ఆమె ఒప్పుకోలేదు. దీంతో పోలీసులు తాళాలు పగలగొట్టారు. ఈ క్రమంలో ఆమె ఇంట్లో 25 కిలోల గంజాయి, ఇతర విలువైన డాక్యుమెంట్లు, బ్యాంకు పాస్ పుస్తకాలు, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పెంచలయ్య హత్య కేసులో కామాక్షి మాత్రమే కాకుండా, ఇంకా ఏడుగురు పాలుపంచుకున్నారు. వారి వద్ద నుంచి ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కామాక్షి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో కొంతమంది యువకులను ముఠాగా ఏర్పాటు చేసింది. వారితో గంజాయి వ్యాపారాన్ని మొదలుపెట్టింది. దీనిని గుర్తించిన పెంచలయ్య, స్థానికులు ఆమె వ్యవహార శైలిని ప్రశ్నించారు. అంతేకాదు గంజాయి వ్యాపారం చేయకూడదని హెచ్చరించారు. అంతేకాదు స్థానికంగా ఉన్న ఒక గుడి వ్యవహారాల్లో కూడా పెంచలయ్య కామాక్షి పెత్తనాన్ని అడ్డుకున్నాడు. దీనిని అవమానంగా భావించిన కామాక్షి పెంచలయ్యను అంతం చేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా తన అనుచరులు జానకిరామ్ ఆలియాస్ జాన్, చింటూ, సంతోష్, విష్ణువర్ధన్, తన భర్త జోసెఫ్ తో పెంచలయ్యను అంతం చేయడానికి ప్రణాళిక రూపొందించింది. పెంచలయ్య గత శుక్రవారం తన కుమారుడిని స్కూటీ మీద కూర్చోబెట్టుకొని పాఠశాల నుంచి ఇంటికి వెళుతుండగా కామాక్షి అనుచరులు ఢీ కొట్టారు. కత్తులతో పొడిచి చంపేశారు. ఇప్పటివరకు పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. మిగతా ఐదుగురు పరారీలో ఉన్నారు.