Nellore Deputy Meyour Vs Ex minister : నెల్లూరులో రాజకీయం రసకందాయంలో పడింది. మొన్నటికి మొన్న ముగ్గురు ఎమ్మెల్యేలపై వైసీపీ హైకమాండ్ వేటు వేసింది. కాదు.. కాదు ఆ ముగ్గురు తామంతట తాముగా పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు నెల్లూరు సిటీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. బాబాయ్, అబ్బాయ్ సవాళ్లు ప్రతిసవాళ్లతో పార్టీ పరువును బజారున పడుతోంది. అయినా అక్కడ దిద్దుబాటు చర్యలకు హైకమాండ్ దిగడం లేదు. దీంతో అది రచ్చరచ్చగా మారుతోంది. ముఖ్యంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఆయన్ను పొమ్మన లేక హైకమాండే పొగ పెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
మంత్రి పదవి పోయిన తరువాత అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిపోయింది. ముఖ్య అనుచరులు చేజారిపోయారు. వారికి అండగా నిలుస్తున్నారు అనిల్ బాబాయ్ రూప్ కుమార్. నెల్లూరు డిప్యూటీ మేయర్ గా ఉన్న రూప్ కుమార్ ఇటీవల అబ్బాయ్ అనిల్ ను విభేదిస్తున్నారు. సొంత అజెండాతో ముందుకెళుతున్నారు. సొంత బాబాయే తిరుగుబాటు చేయడంతో పాటు ఆయనకు టిక్కెట్ లేదని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. తన నీడన రాజకీయాలు చేయాల్సిన బాబాయ్ రూప్ కుమార్ తన టిక్కెట్ కే ఎసరు పెడుతున్నట్లుగా కనిపించడంతో అనిల్ కుమార్ రగిలిపోతున్నారు. సీఎం జగన్ ఇద్దరూ కలిసి పని చేయాలని సూచించినా రూప్ కుమార్ వెనక్కి తగ్గకపోవడం విశేషం.
నెల్లూరు సిటీలో ఎమ్మెల్యే అనిల్ తన క్యాంపు ఆఫీసుకు రాజన్నభవన్ అని పెట్టుకున్నారు. ఇప్పుడు డిప్యూటీ మేయర్ హోదాలో రూప్ కుమార్ క్యాంపు ఆఫీసును ఏర్పాటుచేశారు. దానికి జగనన్న భవన్ అని పేరు పెట్టుకున్నారు. జగనన్న పేరుతో తొలుత కార్యాలయం ఏర్పాటుచేసింది తానేనంటూ రూప్ కుమార్ చెబుతున్నారు. అనిల్ వ్యతిరేక వర్గానికి ఈ కార్యాలయం షెల్టర్ గా మారుతోంది.ఆఫీస్ ప్రారంభోత్సవానికి అనిల్ వ్యతిరేక వర్గం హాజరైంది. నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ సహా ఇతర నాయకులు రూప్ కుమార్ వెంట నడిచారు. అనిల్ కుమార్ అనుచరుల్లో సగం మందికిపైగా రూప్ కుమార్ వెంట వెళుతున్నారు. అనిల్ కు టిక్కెట్ దక్కకూడదన్న ఏకైక అజెండాతోనే రూప్ కుమార్ ఇవన్నీ చేస్తున్నట్టు నెల్లూరు సిటీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
రూప్ కుమార్ వెనుక సీఎం జగన్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. జగన్ ప్రోత్సాహంతోనే రూప్ కుమార్ అనిల్ ను వ్యతిరేకిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఇటీవల అనిల్ మాటల్లో కూడా ఇదే ధ్వనిస్తోంది. తన ప్రాణం ఉన్నంతవరకూ వైసీపీలోనే ఉంటానని.. జగన్ మెడపెట్టి గెంటినా బయటకు వెళ్లనంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలు వెనుక వేరే అర్ధాలు ఉన్నట్టు తెలుస్తోంది. రూప్ కుమార్ కి సిటీలో మంచి పట్టు ఉంది. పార్టీపట్ల విధేయత ప్రదర్శిస్తూనే అనిల్ కి వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్నారు. నెల్లూరు సిటీ రాజకీయం ఎటు తిరుగుతుందో చూడాలి మరీ.